Reading Time: < 1 minute

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లి గ్రామంలో ఆదివారం అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సాగునీటి కోసం పొలంలో తవ్విన కుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముచ్చర్లపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డి కుమార్తె సిరి (14), కుమారుడు శ్రీమన్యు (14) శ్రీకాంత్ రెడ్డి అక్క కుమార్తె స్నేహ (16) లు ప్రమాదవశాత్తు వ్యవసాయ కుంటలో పడిపోయారు. శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కెమ్జల్ లో నివసిస్తున్నాడు,

తన అక్క చంద్రకళ రావిర్యలలో ఉంటారని, శ్రీకాంత్ రెడ్డి అమ్మ అనారోగ్యంతో ఉందని తెలియగా చూడటానికి వచ్చి పొలం వద్దకు వెళ్లారని అంతలోనే ఇంతటి ఘోరం జరిగిందని తెలిపారు.మొదట ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో పడగా,వారిని రక్షించే క్రమంలో మిగతా ఇద్దరు కూడా లోపలికి వెళ్లి నీటిలో మునిగిపోయినట్లు తెలిపారు.

స్థానికులు గమనించి వారిని వెలికితీసే లోపే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాంత్ రెడ్డికి చెందిన ఇద్దరు పిల్లలు (సిరి, శ్రీమన్యు) ఒకేసారి మృతి చెందడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అల్లారుముద్దుగా పెరిగిన పిల్లలు కళ్లముందే నిర్జీవంగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.