
హైదరాబాద్: ఇటీవల గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. గుంటనక్కను చూసి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ను గుంటనక్కఅంటూ కవిత విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు వీరు ఎప్పుడూ మాట్లాడలేదని, బడా కాంట్రాక్టర్ల కోసమే బిఆర్ఎస్ నేతల మాటలు ఆడుతున్నారని తెలియజేశారు. బిఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, టెండర్ల కోసం కాంగ్రెస్ నిబంధనలు పెట్టడం తప్పేనని విమర్శించారు. టెండర్ల విషయాన్ని సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుతున్నారని, మెగా కృష్ణారెడ్డి కోసమే నైనీ టెండర్లు అని కవిత పేర్కొన్నారు.
సృజన్ రెడ్డి అనే చిన్న చేపను పట్టుకుని..పెద్ద తిమింగళాన్ని కాపాడటానికి గుంటనక్క ప్రయత్నమని అన్నారు. డిప్యూటీ సిఎం విక్రమార్కకు కాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయడమేంటీ? అని భట్టి విక్రమార్కకు లేఖ రాయడానికి బిఆర్ఎస్ కు ఏంటీ సమస్య? అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ లో చేరుతానని అనలేదని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడొద్దని హెచ్చరించారు. తమ పార్టీ నిర్మాణ పనుల్లో తాము ఉన్నామని, సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పార్టీ కాంగ్రెస్ అని.. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాగృతి లోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. జాగృతిలో చేరితే మహేష్ గౌడ్ కు మంచి పోస్టు ఇస్తానని కవిత స్పష్టం చేశారు.