
హైదరాబాద్: సింగరేణి స్కాంపై డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సింగరేణి స్కాంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని భట్టి అన్నారు.. కానీ ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి అని.. అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానం చెప్పకుండా దాటవేశారని చురకలంటించారు..బొగ్గు స్కాంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాటల గారడీ చేశారని, సైట్ విజిట్ సర్టిఫికేట్ పై భట్టి అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు. పిల్లల బట్టలు ఆరవేసే క్లోత్ డ్రయర్ పై కేంద్రం సైట్ విజిట్ విధానం పెట్టిందని.. దానికీ కోల్ కి సంబంధం ఉందా? అని.. ఎక్కడా ఓవర్ బర్డెన్ రిమూవల్ వర్క్ కోసం సైట్ విజిట్ నిబంధన పెట్టారా? అని ప్రశ్నించారు. సింగరేణి టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదని, కాంగ్రెస్ వచ్చాక టెండర్ల ప్రక్రియలో.. తమవారికి టెండర్లు ఇచ్చుకునేందుకే ఈ సంస్థలను పక్కన పెట్టారని ధ్వజమెత్తారు.
సిఎంను బొగ్గు స్కాం నుంచి బయటపడేందుకు భట్టి ప్రయత్నాలు చేస్తున్నారని, సింగరేణి టెండర్లను సిఎమ్ పిడిఎన్, మెకాన్, ఆర్ఎల్ పిడిఎస్ పరిశీలిస్తాయని తెలియజేశారు. 2018 నుంచే సైట్ విజిట్ నిబంధన ఉందని భట్టి చెప్పారని, సైట్ విజిట్ చేసినా చాలా కంపెనీలకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదని అన్నారు. భట్టి చెప్పిన సైట్ విజిట్ ఒబి వర్క్స్ కి ఉందా? అని.. సింగరేణి స్కాంకు ఎవరు బాధ్యులు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. సింగరేణి కోల్ స్కాం, సివిల్ సప్లై స్కాం, ఇసుక స్కాం, ఫోర్త్ సిటీ స్కాం, అమృత్ టెండర్ల స్కాం, సోలాప్ పవర్ స్కాం ఇంకా చాలా ఉన్నాయని, సిఎం బావమరిది శోధా కన్ స్ట్రక్షన్స్ సృజన్ రెడ్డి మొదటి లబ్ధిదారుడు అని.. 2025 మే తర్వాత అన్ని టెండర్లకు రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఎవరికి సింగరేణి టెండర్లు ఇవ్వాలో సృజన్ రెడ్డి నిర్ణయించారని, 2025 మే నుంచి ఎన్ని టెండర్లు పలిచారు? అని ఎంతమంది సైల్ విజిట్ చేశారు? ఎంతమందికి సర్టిఫికెట్ ఇచ్చారు? అని నిలదీశారు. మొన్న స్కాంలు బయటపెట్టాం.. కాబట్టే మమ్మల్ని విచారణకు రావాలంటూ పిలిచారని, ఈ అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. త్వరలో ఆధారాలు బయటపెడతానని హరీశ్ రావు సూచించారు.