Reading Time: < 1 minute

అమరావతి: ప్రియుడికి పెళ్లి కావడంతో తనని దూరం పెడుతున్నాడని, అతడి భార్యపై ప్రియురాలు వైరస్ ఇంజక్షన్‌తో దాడి చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన ఓ వైద్యుడు, ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆరు నెలల క్రితం వైద్యుడికి మరో యువతితో పెళ్లి జరిగింది. అప్పటినుంచి ప్రియురాలుకు వైద్యుడు దూరంగా ఉంటున్నాడు. తనని ప్రియుడు నిర్లక్షం చేస్తున్నాడని అతడి భార్యపై ప్రియురాలు పగ పెంచుకుంది. వైద్యుడి భార్య బైక్‌పై వెళ్తుండగా ఆమెను వాహనం నుంచి కిందపడేలా చేశారు. రోడ్డుపై పడగానే సాయం చేస్తున్నట్టుగా ముగ్గురు వ్యక్తులు నటించి ఆమెను ఆటోలో తీసుకెళ్లారు. అప్పటికే ఆటోలో ఉన్న ప్రియురాలు ఆమెపై ఇంజక్షన్‌తో దాడి చేసింది. వైద్యుడి భార్య గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి అందరు తప్పించుకున్నారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే ప్రియురాలిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. ప్రియురాలుతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.