Reading Time: < 1 minute

శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీ నివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో టైటిల్ సాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్, నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సిటీ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ “మన జీవితంలో చాయ్ అనేది ఎంతో ముఖ్యమైనదిగా మారింది. ఈ ‘చాయ్ వాలా’ టైటిల్ సాంగ్ చాలా బాగుంది.

శివ కందుకూరి లాంటి యంగ్ హీరో, రాజీవ్ కనకాల లాంటి సీనియర్ యాక్టర్స్ ఇందులో నటించారు. నీలోఫర్ బాబురావు అందరికీ స్పూర్తి. ఆయన ఈ మూవీని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఫిబ్రవరి 6న ఈ చిత్రం రాబోతోంది. అందరూ ఈ మూవీని చూసి హిట్ చేసి, యంగ్ టీంని ఆశీర్వదించాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది” అని అన్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ “ఈ మూవీలోని భావోద్వేగం అందరినీ కట్టి పడేస్తుంది. సిగ్గు వల్లో, భయం వల్లో ఇంట్లో చేయని సంభాషణ, బయటకు చూపించలేని ఎమోషన్ ఇందులో ఉంటుంది. ‘చాయ్ వాలా’ అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం”అని పేర్కొన్నారు. దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ “చాయ్ వాలా సినిమాకి ప్రశాంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సురేష్ సాహిత్యం చక్క గా కుదిరింది. ఈ మూవీకి రాజీవ్ కనకాల ప్రాణం. ఈ చిత్రంలో శివ అదరగొట్టేశారు. నేను ఈ మూవీ విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, రాజీవ్ కనకాల, శశాంక్, సత్యనారాయణ, వెంకట్, క్రాంతి వర్ల, ప్రశాంత్ ఆర్.విహారి తదితరులు పాల్గొన్నారు.