
ఆ వ్యవస్థ ఇప్పుడు మనకు అవసరమా అన్న చర్చ ప్రస్తుతం దేశంలో పెద్దయెత్తున సాగుతున్నది. ఈ చర్చ ఇవాళ కొత్తగా ప్రారంభమైంది కాదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ అధికారం చలాయించినంత కాలం దీనిమీద పెద్ద వివాదం లేదు. జాతీయ స్థాయిలోనూ, ప్రాంతాలవారీగాను కొత్త రాజకీయశక్తులు పుట్టుకొచ్చిన దగ్గరనుండి ఈ వ్యవస్థ విమర్శలకు గురయ్యే విధంగా తయారైంది. ఇప్పుడు అసలు ఈ వ్యవస్థ అవసరమా అన్న చర్చ జరగాల్సి ఉన్నది. ఒకవేళ అవసరమైతే దీనిలో చేయవలసిన మార్పులు చేర్పులు ఏమిటి అన్న విషయంపై పార్లమెంట్ సీరియస్‌గా చర్చించాలి. ఆ వ్యవస్థే.. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా ఇతర రాజకీయపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్న గవర్నర్ల వ్యవస్థ. కేంద్రంలో మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ కూటమి గవర్నర్లు బస చేసే రాజభవన్ల పేరును లోక్ భవన్లుగా మార్చిందే తప్ప ఆ భవన్లలో కూర్చుని పని చేసే గవర్నర్ల విధివిధానాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది పాత సీసాకు కొత్త లేబుల్ అతికించినట్లు ఉంది తప్ప మరొక ప్రయోజనం ఏమీ లేదు.
అసలు ఈ గవర్నర్ల వ్యవస్థ మన ఆలోచన కాదు. ఇతర అనేక విషయాల్ని పోతూపోతూ మన నెత్తిన రుద్దినట్టే ఈ గవర్నర్ల వ్యవస్థను కూడా బ్రిటిష్ పాలకులే మనకు అందించి పోయారు. దేశానికి స్వతంత్రం లభించిన సమయంలో, రాజ్యాంగాన్ని రాసుకునే క్రమంలో గవర్నర్లను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ముసాయిదా పత్రంలో పేర్కొన్నారు. కానీ రాజ్యాంగ పరిషత్ మాత్రం దాన్ని మార్చి గవర్నర్లను కేంద్ర మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి నియమించే పద్ధతిని ఎంపిక చేసింది. గవర్నర్ల వ్యవస్థ మీద ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ సూచించిన ప్రవర్తన నియమావళి ప్రకారం క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్లుగా నియమించకూడదు. గవర్నర్ల నియామకాల్లో ముఖ్యమంత్రిని సంప్రదించాలి. కేంద్రప్రభుత్వాలు ఈ రెండు సూచనలు తప్ప ఇంకా ఏవేవో ప్రాధాన్యతల్ని పరిగణనలోకి తీసుకొని గవర్నర్లను నియమిస్తున్నాయి. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న రాష్ట్రప్రభుత్వాలకు, కేంద్రం నియమించే గవర్నర్లకు మధ్య ఘర్షణ నేడు కొత్తగా జరుగుతున్నది కాదు. ఈ జాడ్యం కాంగ్రెస్ నుండే బిజెపి వారసత్వంగా అందుకున్నది. ఎన్‌డిఏయేతర పక్షాలు అధికారంలో ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇటీవల గవర్నర్లు వ్యవహరించిన తీరు మళ్లీ ఒకసారి చర్చకు తెరలేపింది అంతే.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 176(1) కింద శాసనసభ సమావేశాల తొలిరోజున గవర్నర్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించాలి. శాసనమండలి కూడా ఉన్న రాష్ట్రాల్లో అయితే ఉభయసభల సభ్యుల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రసంగించాలి. గవర్నర్ ప్రసంగపాఠాన్ని రాష్ట్ర మంత్రిమండలి రూపొందిస్తుంది. గవర్నర్ గారికి బయట ఏ రాజకీయాలు ఉన్నా అక్కడ మాత్రం తన ప్రభుత్వ నివేదికగానే ఆ ప్రసంగం చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో, డిఎంకె పాలనలో ఉన్న తమిళనాడులో, కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న కేరళలో గవర్నర్లు శాసనసభ్యులను ఉద్దేశించి సమావేశాల మొదటి రోజున చేసే ప్రసంగంలో తమకు నచ్చనివి చదవకుండా వదిలేయడం, మార్చుకోవడం చేస్తున్నారు. అర్ధంతరంగా శాసనసభల నుండి వాకౌట్లు కూడా చేస్తున్నారు. సాధారణంగా చట్టసభల్లో ప్రతిపక్ష సభ్యులు తమ వాదన వినిపించే అవకాశం లేకపోతేనో, తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తేనో వాకౌట్లు చేస్తుంటారు. ఇప్పటి గవర్నర్లు చిత్రంగా తామే వాకౌట్ చేసి ప్రతిపక్ష సభ్యులు కూడా ముక్కున వేలేసుకునేట్టు చేస్తున్నారు. గవర్నర్లను నియమించే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉన్నప్పటికీ గవర్నర్ కేంద్రానికి అధీనుడేం కాదు. కేంద్రం ఏజెంటూ కాడు. అది స్వతంత్ర రాజ్యాంగ పదవి అని 1997లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే రాజకీయ ప్రయోజనాలతో నియమితులయిన గవర్నర్లు సుప్రీంకోర్టు తీర్పును ఆసరా చేసుకుని స్వతంత్రంగా వ్యవహరిస్తారని ఆశించలేం కదా. గవర్నర్లందరూ ఇలాగే ఉంటారు అనడానికి లేదు. స్వతంత్రంగా వ్యవహరించి ఆ పదవికి వన్నెతెచ్చిన, తెస్తున్న గవర్నర్లు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.
కేంద్రంలో అధికారంలో ఉన్నవారి రాజకీయ ప్రయోజనాల్ని కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే గవర్నర్లు మనకి ఎక్కువగా కనిపిస్తారు. పశ్చిమబెంగాల్లో గవర్నర్‌గా ఉన్నప్పుడు జగదీప్ ధన్కడ్ వ్యవహరించిన తీరైనా, కేరళ గవర్నర్‌గా అప్పట్లో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అడుగడుగునా అడ్డుపుల్లలు వేసిన ఉదంతమయినా మన కళ్ళ ముందు ఉన్నాయి. గవర్నర్ల వ్యవహారశైలి పట్ల అభ్యంతరపెడుతూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ మధ్య సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వాలు ఆమోదం కోసం పంపే బిల్లులను గవర్నర్ల దగ్గర మూడు మాసాలకు మించి పెండింగ్‌లో ఉన్నట్లయితే అవి ఆమోదం పొందినట్టుగానే భావించాలన్నది ఆ తీర్పు సారాంశం. అయితే సుప్రీంకోర్టు ఆ తర్వాత కాలంలో దానిని ఉపసంహరించుకోవడం గమనార్హం. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఎంపిక చేసి మరీ కొంతమందిని గవర్నర్లుగా పంపడం మామూలే. ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో గవర్నర్లకు రాష్ట్రాలను ఇబ్బందిపెట్టే అధికారాలు ఉన్నాయి. ఏ అధికారాలూ లేకపోతే ఇక గవర్నర్ల వ్యవస్థ ఎందుకు అని కూడా ఎవరైనా అనొచ్చు. గవర్నర్ల వ్యవస్థ అవసరమే, అయితే ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు పరిపాలన సాగించే క్రమంలో రాజకీయంగా వారిని ఇబ్బంది పెట్టడానికి గవర్నర్లు ఆ అధికారాలను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు అవసరమైన సంస్కరణలు రావాలి.
కేరళలో ఏర్పాటైన మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్ పంపిన నివేదికను ఉపయోగించుకోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇంకా మన స్మృతిపథంలోంచి చెరిగిపోని సంఘటన 1984 లో ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా గద్దె దింపి, తగినంత బలం లేకపోయినా నాదెండ్ల భాస్కరరావు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన రామ్ లాల్ తెలుగు ప్రజల దృష్టిలో ఎప్పటికీ విలన్‌గానే మిగిలిపోతాడు. నెల రోజుల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ పొరపాటు గ్రహించి మళ్లీ ఎన్‌టి రామారావుకు అధికారం అప్పగించడానికి శంకర్ దయాళ్ శర్మను గవర్నర్‌గా పంపించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వచ్చిన కుముద్ బెన్ జోషి గవర్నర్ గా తన బాధ్యతలకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎన్‌టి రామారావును చికాకు పరచడానికి, ఇబ్బంది పెట్టడానికి రాజభవన్ నుండి సమాంతర ప్రభుత్వం నడిపారన్న విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది.
ఇవన్నీ ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ తానే గవర్నర్లకు స్వయంగా చెప్పి చేయించారా అంటే, వారిచ్చిన తప్పుడు నివేదికల ప్రభావంతో ఆమె నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చునని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి కేంద్రానికి గవర్నర్లు నివేదిక ఇవ్వడం సహజం. అయితే అవి వాస్తవాలమీద ఆధారపడినవై ఉండాలి. అలా కాకుండా కేంద్రం మెప్పు పొందడానికి లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడటానికి నివేదికలు ఇస్తే గవర్నర్ల వ్యవస్థకు విశ్వసనీయత కొరవడుతుంది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దశాబ్దానికి పైగా గవర్నర్‌గా పని చేసిన ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను గుర్తు చేసుకోవాలి. యుపిఎ హయాంలో తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం తారస్థాయిలో ఉండగా గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన నరసింహన్ రాష్ట్రం విడిపోయాక ఎన్‌డిఎ హయాంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకూ క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు నిర్వహించి ఎప్పటికప్పుడు కేంద్రానికి వాస్తవ నివేదికలను అందించిన విషయం తెలిసిందే.
పూర్తిగా రాజకీయాల్లో తలమునకలై ఉండేవారిని పునరావాసం కోసం గవర్నర్లుగా నియమిస్తే ఏం జరుగుతుందో కూడా చరిత్రలో రికార్డు అయి ఉంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాజకీయాల్ని శ్వాసించేవారు.. శాసించేవారు కూడా. ఆయనను ఖాళీగా ఉంచలేక కాంగ్రెస్ పార్టీ తమిళనాడు గవర్నర్ గా పంపిస్తే రాజకీయంగా అత్యంత బలవంతురాలైన ఎఐఎడిఎంకే అధినేత్రి, అప్పటి ముఖ్యమంత్రి జయలలితను ముప్పుతిప్పలు పెట్టిన విషయం మరచిపోగలమా! గవర్నర్‌ను రీకాల్ చేయాల్సిందిగా ఆమె ప్రధానమంత్రి పివి నరసింహారావుకు, రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు విన్నవించుకునే దాకా పరిస్థితిని తీసుకుపోయారు. అప్పట్లో చెన్నారెడ్డి జనతా పార్టీ నాయకుడిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి జయలలిత మీద చేసిన అవినీతి ఆరోపణల మీద విచారణకు అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఆగ్రహించిన జయలలిత అభిమానులు, పార్టీ కార్యకర్తలు గవర్నర్ చెన్నారెడ్డి కాన్వాయ్ మీద గుడ్లు, రాళ్లు విసిరిన విషయం పత్రికలు ప్రచురించాయి. చెన్నారెడ్డి అంతకుముందు కూడా ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా 1974 నుంచి 77 వరకు పనిచేసి 78లో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ (ఐ) రాష్ట్ర అధ్యక్షుడై, ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే.
ఇలా రాజకీయాల్ని ఇంకా వదిలిపెట్టనివాళ్లను గవర్నర్లుగా నియమిస్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలంగాణ గవర్నర్‌గా తమిళిసైని నియమించినప్పుడు చూశాం. తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించి అక్కడి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టిన తర్వాత ఆమెను మళ్లీ తమిళనాడుకు తీసుకుపోయి శాసనసభకు పోటీ చేయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న కాలానికి, మళ్లీ శాసనసభ్యురాలిగా పోటీచేసే కాలానికి మధ్య స్వల్ప కాలమైనా గవర్నర్‌గా ఆమె రాజకీయాలను ఎలా మర్చిపోగలరు? ఇలాంటి ఉదంతాలు అనేకం. గవర్నర్ల దాష్టీకాన్ని అనుభవించిన కారణంగానే ఎన్‌టి రామారావు కేంద్రం మిథ్య అన్నారు, గవర్నర్ల వ్యవస్థను రద్దు చెయ్యాల్సిందేనని కూడా పలుమార్లు కోరారు. రాష్ట్రాల సమూహమే కేంద్రం. మనది ఫెడరల్ వ్యవస్థ అయినప్పటికీ స్వతంత్ర రాజ్యాలు కావు కాబట్టి కేంద్రం ఉంటుంది, తప్పదు. అయితే స్వతహాగా ఆవేశపరుడయిన ఎన్‌టిఆర్ గవర్నర్ల వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని సూచించలేకపోయారు. రాష్ట్రప్రభుత్వాలపట్ల గవర్నర్లు రాజకీయ కారణాలతో కక్షసాధింపు ధోరణి అవలంబించకుండా సుప్రీంకోర్టు ఒక సందర్భంలో చెప్పినట్టు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ (స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి) గా ఉండేందుకు అనువయిన సంస్కరణలు రాకపోతే గవర్నర్ల వ్యవస్థ మరింత అపకీర్తి మూట కట్టుకోక తప్పదు.
దేవులపల్లి అమర్