
గౌహతి: న్యూజిలాండ్‌తో ఆదివారం గౌహతి వేదికగా జరిగే మూడో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య భారత జట్టు సిరీస్‌పై కన్నెసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌పై కైవసం చేసుకోవాలనే యోచిస్తోంది. తొలి రెండు టి20లో ఓడిన న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ చాఓరేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి సిరీస్‌పై పట్టు సాధించాలనే పట్టుదలతో కివీస్ బిరలోకి దిగుతోంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయం. నాగ్‌పూర్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇక రాయ్‌పూర్ సయితం ఇరు జట్టు పరుగుల వరదపారించాయి. ఈసారి కూడా బ్యాటింగ్‌పైనే రెండు జట్లు ఆశలు పెట్టుకున్నాయి.
తొలి టి20లో భారత యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయినా.. రెండో టి20లో త్వరగా పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. ఈసారి కూడా ఈ బ్యాటింగ్ త్రయంపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే రెండో టి20 మ్యాచ్‌లోనూ సంజు శాంసన్ విఫలం కావడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈసారైనా వీరు తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రింకు సింగ్, హార్దిక్ పాండ్యలు ఫామ్‌లో ఉండడం భారత్‌కు ఊరట కలిగించే అంశం. తొలి మ్యాచ్‌లో రింకు మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. భారత్ భారీ స్కోరు సాధించినా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫీల్డింగ్ చాలా పేలవంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దు కోక తప్పదు. బౌలర్లు కూడా మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
తప్పక గెలవాల్సిందే..
మరోవైపు రెండు టి20ల్లోనూ ఓడిన న్యూజిలాండ్ గౌహతి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగానే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో కివీస్ కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది.