
మన తెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూ ములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లే దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారన్నారు. దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధతో పైలెట్ ప్రాజెక్టు కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి అనేక అవినీతి, అక్రమాలు గుర్తించామన్నారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన ఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. విచారణలో ఎదురైన అం శాలు, ఎవరి పాత్ర ఎంత? తెర వెనుక ఎవరైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉం దా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ప్రాథమిక నివేదికను పరిశీలించి మరికొన్ని సలహాలు సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని సూచించారు.
4,848 లావాదేవీల్లో అక్రమాలు : ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35 లక్షల లావాదేవీలు జరిగాయని, ఇందులో ప్రాథమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే విచారణ తర్వాత 1109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు రూ.4 కోట్లు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా ఎలాంటి ముందు చూపు లేకుండా ఒక కుట్ర పూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొంత మంది అక్రమాలకు పాల్పడితే భూ భారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించి తక్షణమే ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు రూ.1000 కోట్ల అవినీతి అని, మరో నాయకుడు రూ.10 వేల కోట్లు అని, ఇంకొకరు భూ భారతి పోర్టల్ అవినీతిమయమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.
నేడు ఖమ్మంలో లైసెన్సులు అందజేత
ఇప్పటికే మొదటి విడతలో నాలుగు వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులను జారీ చేశామని, ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో మరో రెండు వేల మందికి లైసెన్సులను జారీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ లైసెన్స్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటిలిజెన్స్ అదనపు డీజీ విజయకుమార్, ఉన్నత స్ధాయి కమిటీ సభ్యులు డీఐజీ ఎం.సుభాషిణి, సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్, ఏసీబీ ఎస్పీ సింధు శర్మ, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎ.సంపత్, ఎన్‌ఐసీ ప్రతినిధి శ్రీనివాస్, హోంశాఖ సలహాదారు పి.శరత్ కుమార్ పాల్గొన్నారు.
కేటీఆర్‌వి మతిలేని మాటలు
సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడుతున్న భాష సరిగా లేదని, మతి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగతంగా తాను రిఫరెండంగా భావిస్తున్నానని అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్ రిఫరెండం అన్నారని, మళ్లీ ఇప్పుడు రిఫరెండం అంటున్నారని, ఇంతకు ముందు జరిగిందే ఈ ఎన్నికల్లో జరుగుతుందన్నారు. ఆనాడు సోయి లేకుండా ఇష్టం వచ్చినట్లు జిల్లాలను ఏర్పాటు చేసి, ఇప్పుడు అగ్నిగుండం చేస్తామని మతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రజామోదంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామన్నారు. బట్ట కాల్చి మీద వేయడమే ప్రతి పక్ష పార్టీ పని అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. తమ రెండేళ్ల పాలనలో ఏ తప్పు జరిగిందని మాట్లాడుతున్నారని నిలదీశారరు. వారి పాలనలో అక్రమాలు జరిగినట్లుగానే ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయని భ్రమపడుతున్నారని,
ఇంకా అధికారంలో ఉన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. దావోస్ పర్యటనకు తన కొడుకు రావడంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని అన్నారు. తన కుమారుడు బిజినెస్ పనిమీదనే దావోస్ వచ్చారని చెప్పారు. తన కుమారుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకోసమే వచ్చారన్నారు. వాళ్లిద్దరికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తన కుమారుడిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని, తనపై భూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈడీ కేసుల గురించి మాట్లాడటం తప్ప మరొకటి ఏం లేదన్నారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. భూభారతిలో రూ.3.9 కోట్ల రిజిస్ట్రేషన్ టాక్స్ అక్రమాలు జరిగాయన్నారు. ప్రతి మండలాన్ని యూనిట్ గా తీసుకుని కేసులు నమోదు చేశామని చెప్పారు. ధరణి అక్రమాలపై సిద్దిపేట, సిరిసిల్లలో కేరళ సంస్థ ఆడిట్ చేస్తోందని అన్నారు. నైని కోల్ మైన్స్ టెండర్లు రాకముందే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు ఉన్నా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.