
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులెవరో, పాత్ర ధారులెవరో తేలాల్సిందే అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక విధానాలపై మంత్రి జూపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ప్రజా భవన్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని, ఫోన్ ట్యాపింగ్ వంటి నీచమైన రాజకీయాలను కేవలం కెసిఆర్ హయాంలోనే చూశానని మంత్రి జూపల్లి విమర్శించారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు 2021లోనే వెల్లువెత్తాయని, మాజీ గవర్నర్ తమిళిసై, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఈటల రాజేందర్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వంటి వారిపై నిఘా పెట్టారనే అనుమానాలు గతంలోనే వ్యక్తం చేసినట్లు గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన అన్నారు.
పోలీసు, ఇంటెలిజెన్స్ వంటి వ్యవస్థల్ని సొంత పార్టీ నేతలను, ప్రతిపక్ష పార్టీ నేతలను, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేయడానికి వాడుకోవడం బిఆర్‌ఎస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి, ప్రొఫెసర్ కోదండరాం వంటి వారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు బిఆర్‌ఎస్ రాజకీయ విలువలు ఏమయ్యాయని మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతన కక్ష సాధింపులకు దిగలేదని స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్య ఉద్దేశ్యమయితే ఎప్పుడో జైలుకు పంపేవాళ్లమని, చట్టాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు. కేవలం సాక్షిగా సమాచారం అడిగే సిఆర్‌పిసి160 నోటీసు ఇస్తేనే ఇంతలా భయపడాలా? అని ఆయన ప్రశ్నించారు. సాక్షిగా విచారణకు పిలిస్తే కెటిఆర్ ఎందుకు అంతలా ఆందోళన చెందుతున్నారని మంత్రి అడిగారు. గతంలో ఏ విచారణకైనా సిద్ధం అని ప్రగల్భాలు పలికిన కెటిఆర్, ఇప్పుడు నోటీసులు రాగానే డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేకపోతే, నిర్ధోషులయితే భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత దుర్మార్గమని, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో తొంగిచూడటం ఏ సంస్కృతిని సూచిస్తుందో బిఆర్‌ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
ఈ విచారణలో బిజెపి, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారిని కూడా సాక్షులుగా పిలుస్తున్నారని, కేవలం బిఆర్‌ఎస్ నేతలనే టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. చట్టబద్ధ సంస్థలపై బురద జల్లే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వారు ఏ పార్టీ వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని ఛిన్నభిన్నం చేసిన బిఆర్‌ఎస్ నేతలను ప్రజలు ఎప్పుడో విస్మరించారని మంత్రి అన్నారు. ఇప్పటికైనా కెటిఆర్, హరీష్ రావు తమపై పడ్డ బట్ట కాల్చి ఇతరుల మీద వేసే పనులు మానుకోవాలని హితవు పలికారు.