Reading Time: < 1 minute

 కెనడాపై 100 శాతం టారీఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శనివారం హెచ్చరించారు. పొరుగుదేశం కెనడా చైనాతో బలోపేత ట్రేడ్ డీల్‌కు దిగుతున్నందున కెనడాకు తమ సుంకాల భారం తప్పదని తెలిపారు. కెనడా సరుకులన్నింటిపైనా వంద శాతం టారీఫ్ పడుతుందని హెచ్చరించారు. చైనా సరుకులు కెనడా మీదుగా అమెరికాకు రవాణా కాకుండా చేస్తామని ట్రంప్ తమ ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు. నేరుగా కెనడా ప్రధాని మార్క్ కార్నేకు చురకలు పెట్టారు. పైగా గవర్నర్ కార్నే అని వ్యాఖ్యానించారు. చైనా సరుకులు అమెరికాకు రావడానికి కెనడాను వాహకం చేసుకోవాలనుకుంటున్నారా? ఇది చెల్లనేరదని పేర్కొన్నారు. తప్పు చేయవద్దని హితవు పలికారు. చైనా కెనడాను అమాంతం మింగేస్తుంది. పూర్తిగా పిప్పి చేస్తుందని వ్యాఖ్యానించారు. తమ ప్రతిపాదిత గోల్డెన్ డోమ్ ఏర్పాటుతో కెనడాకే రక్షణ కల్గుతుంది. దీనిని కాదని కెనడా చైనాతో వాణిజ్య బందానికి దిగితే అర్థం ఏమిటని ప్రశ్నించారు.చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందం కుదిరితే అది నార్త్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు కల్గిస్తుంది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టినట్లే అని తెలిపారు. కెనడాపై అమెరికా హక్కు నేపథ్యంలోనే ఈ దేశ ప్రధానిని గవర్నర్‌గా సంబోంధించినట్లు భావిస్తున్నారు.