Reading Time: < 1 minute

కోజికోడ్: తనకు పార్టీతో కొన్ని సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తెలిపారు. అయితే వీటిని తాను పార్టీ అధినాయకత్వంతో ప్రస్తావిస్తానని చెప్పారు. కానీ తాను ఎప్పుడూ పార్టీలో నిర్ధేశిత క్రమశిక్షణా రేఖలు దాటలేదని స్పష్టం చేశారు పార్లమెంట్‌లో పార్టీ పేర్కొన్నట్లే వ్యవహరించినట్లు వివరించారు. పార్టీలో అంతర్గత విభేదాలు అనేవి సహజం, వీటిని చర్చలతో పరిష్కరించుకోవచ్చునని, మీడియా ద్వారా కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ కీలక ఉద్యమ కార్యక్రమానికి థరూర్ హాజరుకాలేదు. ఈ దశలోనే ఆయన ప్రధాన మంత్రి మోడీ తిరువనంతపురం పర్యటనపై శ్రద్ధ చూపారనే వార్తలు వెలువడ్డాయి.

అంతేకాకుండా కేరళ కాంగ్రెస్ వ్యవహారాలలో తనను పట్టించుకోవడం లేదని, ఇటీవ కోచిలో కార్యక్రమాలకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ తనను చూసీచూడనట్లు ఉన్నాడని థరూర్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే థరూర్ స్పందించారు. పార్టీతో కొన్ని అంశాలు ఉన్నాయనే చెప్పాలి. అయితే వీటిని సమస్యలుగా కూడా భావించాల్సి ఉంటుందన్నారు. తాను పార్టీ సమావేశాలకు హాజరు కాలేనప్పుడు ఎప్పటికప్పుడు ముందుగానే నాయకత్వానికి తెలియచేస్తున్నానని, వివాదాస్పదం అయితే తనకు సంబంధం లేదన్నారు.