Reading Time: 2 minutes

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ చేసిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ విచారణ పూర్తి అయింది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరులోని ఎసిబి కోర్టులో సిట్ అధికారులు సంచలన విషయాల తో కూడిన తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగి నట్లు విచారణలో శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ భారీ స్కామ్‌లో సిట్ మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో 12 మంది టిటిడి ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా మాజీ టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ వ్యక్తిగత సహాయకుడు కాసూరి చిన్న అప్పన్న పేరు ఛార్జి షీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీలతో కుమ్మక్కై, కిలోకు రూ. 25 చొప్పున కమీషన్లు డిమాండ్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు హవాలా మార్గాల్లో దాదాపు రూ. 50 లక్షల వరకు లంచాలు అప్పన్నకు అందినట్లు విచారణ లో వెల్లడైంది.

అప్పన్న ఎవరి కోసం ఇలా చేశాడో సిబిఐ తేల్చాల్సి ఉంది. ఉత్తరాఖండ్‌కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ఈ కుంభ కోణంలో కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ గుర్తించింది. అస్సలు పాలు, వెన్న సేకరించని ఈ డెయిరీ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనా లను కలిపి కృత్రిమ నెయ్యి ని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసింది. 2019-24 మధ్య సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని రూ. 250 కోట్ల విలువైనది టిటిడికి అంటగట్టినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 2022లో ఈ డెయిరీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినప్పటికీ, ఇతర బినామీ డెయిరీల పేరుతో మళ్ళీ సరఫరా కొనసాగించడం గమనార్హం. కమీషన్ల కక్కుర్తి కోసం నాణ్యత లేని నెయ్యిని అనుమతించడం వల్ల శ్రీవారి లడ్డూ రుచి, నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నాయని సిబిఐ స్పష్టం చేసింది. తక్కువ ధరకు టెండర్లు వేసిన కంపెనీలు, నాణ్యతా ప్రమాణాలను పాటించకుం డా ల్యాబ్ రిపోర్టులను సైతం మేనేజ్ చేసినట్లు విచారణలో బయటపడింది. లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్ట బోమని, చట్టప రంగా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణాధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు భక్తుల్లో తీవ్ర చర్చ మొదలైంది.