
రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా జరిగే రెండో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య భారత జట్టు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలనే లక్షంతో బరిలోకి దిగుతోంది. తొలి టి20లో ఓడిన న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ఇందులో గెలిచి తిరిగి గాడిలో పడాలనే పట్టుదలతో కివీస్ కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయం. నాగ్‌పూర్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈసారి కూడా బ్యాటింగ్‌పైనే రెండు జట్లు ఆశలు పెట్టుకున్నాయి.
తొలి టి20లో భారత యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడి చేసిన అభిషేక్ భారత్‌కు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే తొలి మ్యాచ్‌లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లు విఫలం కావడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈసారైనా వీరు తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ మరింత బాధ్యతతో ఆడక తప్పదు. రింకు సింగ్, హార్దిక్ పాండ్యలు ఫామ్‌లో ఉండడం భారత్‌కు ఊరట కలిగించే అంశం. కిందటి మ్యాచ్‌లో రింకు మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. నాగ్‌పూర్‌లో భారీ స్కోరు సాధించినా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫీల్డింగ్ చాలా పేలవంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దు కోక తప్పదు. బౌలర్లు కూడా మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
ప్రతీకారం కోసం..
మరోవైపు తొలి టి20లో ఓడిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో గెలిచి తిరిగి గాడిలో పడాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగానే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో కివీస్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది.