Reading Time: 2 minutes

ఓటర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకునేలా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పునః పరిశీలనను ఎన్నికల కమిషన్ చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని, అందువల్ల ఈ కసరత్తు ఓటర్ల ఓటు హక్కుకు ఎలాంటి భంగం కలిగించబోదని సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని భరోసా ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా పశ్చిమబెంగాల్‌లోని గ్రామ పంచాయతీ భవనాలు, తాలూకా బ్లాక్ ఆఫీసుల్లోను, వార్డు ఆఫీసుల్లోనూ వ్యత్యాసాలున్న ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశించడం చెప్పుకోతగ్గది. అంతేకాదు ఈ కసరత్తు వల్ల ఎవరైతే బాధితులవుతున్నారో వారు తమ డాక్యుమెంట్లను లేదా అభ్యంతరాలను పంచాయతీ భవనాలు, బ్లాక్ ఆఫీసుల్లోను సమర్పించుకునే అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌కు సూచించింది. అయితే ఎన్నికల కమిషన్ ఓటర్లు జాబితాల్లో అనేక వైరుధ్యాలు ఉండడం వల్లనే పశ్చిమబెంగాల్‌లో దాదాపు 1.25 కోట్ల ఓటర్లను జాబితాల్లోంచి తొలగించవలసి వచ్చిందని వాదిస్తోంది.

2002 నాటి జాబితాలోని ఓటర్ల సంతానంతో వివరాలు సరిపోలకపోవడం, వివిధ అక్షర దోషాలు చోటు చేసుకోవడం ఈ వైరుధ్యాలకు దారితీసిందని చెబుతోంది. అలాగే తల్లిదండ్రులకు వారి పిల్లలకు వయసులో 15నుంచి 50 ఏళ్ల వరకు తేడాలు కనిపించడం జరుగుతోందని పేర్కొంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో వారికి నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది. అయితే ఈ వైరుధ్యాల వెనుక ఉండే తర్కం కోర్టును ఒప్పించలేకపోతోంది. దేశంలో బాల్య వివాహాలు లేవు కదా తల్లికి, బిడ్డకు 15 ఏళ్ల వరకు వయసు తేడా ఎలా వస్తోందని కోర్టు ఆశ్చర్యబోతోంది. ప్రజల హృదయాల్లో నమ్మకం కలిగించేలా ఎన్నికల కమిషన్ సమాధానాలు ఉండడం లేదు. ప్రజల ఓటు హక్కులకు సంబంధించి ఏం నిర్ణయాలు అయినా తీసుకునే స్వేచ్ఛ ఎన్నికల కమిషన్‌కు ఉన్నప్పటికీ నమ్మకం కోల్పోతే ఎన్నికలను నిర్వహించే సామర్థం కమిషన్‌కు ఉండదు. వాస్తవానికి ఇతర సంస్థల కన్నా ఎన్నికల కమిషన్ తనకు తానే విశ్వాసాన్ని కోల్పోతోంది.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితాలు తయారు చేస్తున్నప్పటికీ మొత్తం ఈ కసరత్తు అంతా కమిషన్‌పై అపనమ్మకంతోనే సాగుతోంది. తన కసరత్తులో తలెత్తుతున్న లోపాలకు బాధ్యత వహించకుండా ఏకపక్షంగా తన వాదనతోనే ముందుకు వెళుతోంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలన ప్రారంభించేటప్పుడు సుప్రీం కోర్టు చేసిన హెచ్చరికలను ఎన్నికల కమిషన్ గుర్తు పెట్టుకోవాలి. ఈ కసరత్తు అంతా ఓటర్లను కలుపుకునే విధంగా సాగాలి తప్ప ఏదో సాంకేతిక లోపాలను చూపించి ఓటర్ల పేర్లను తొలగించకూడదని సుప్రీం కోర్టు ఆనాడే హెచ్చరించింది. ఎన్నికల జాబితాల ప్రక్షాళనను ఏ పార్టీ, ఏ వ్యక్తీ తన అధికారాన్ని ప్రశ్నించలేరు. కానీ ఓటర్లను తొలగించడం లేదా తిరస్కరించడం వంటి చర్యలకు బాధ్యత వహించకుండా కమిషన్ తనకు తాను సమర్ధించుకోవడం ఎవరికీ ఆమోద యోగ్యం అనిపించదు. ఎన్నికల జాబితానుంచి ఒక పేరు ఎందుకు తొలగించవలసి వచ్చిందో వివరించడానికి బదులు ప్రజలను తాము అసలైన ఓటర్లమని నిరూపించుకోవాలని అగ్నిపరీక్ష పెట్టడం మొండితనం గానే అసంతృప్తి కలిగిస్తుంది. పౌరులకు ఓటు హక్కు తొలగించే విషయంలో తాను తీసుకున్న చర్యలతో సుప్రీం కోర్టును ఎన్నికల కమిషన్ ఒప్పించలేకపోవడం గమనార్హం. కనీసం ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన అధికార పీఠం బాధ్యతల సంగతి పక్కనపెట్టి వాస్తవాలు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం. పౌరులపట్ల తన బాధ్యత ఏమిటో అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియను ప్రజలకు అసౌకర్యంగా, ఇబ్బందులు కలిగించేలా ఉండకుండా ప్రజల్లో నమ్మకం కలిగించేలా చాలా సున్నితంగా నిర్వహించక తప్పదు.

ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెద మేనల్లుడు, 60 ఏళ్ల చంద్ర కుమార్ బోస్ పశ్చిమబెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ సరిగ్గా జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఆయన 2016 అసెంబ్లీ ఎన్నికల్లోను, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన, ఆయన భార్య, కుమార్తె జనవరి 16న ఎన్నికల కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు విదేశాల్లో ఉండడంతో వారి తరఫున కూడా విచారణలో వకాల్తా పుచ్చుకున్నారు. తామంతా ఎన్యూమరేషన్ ఫారాలతో సహా కావలసిన డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ, పరిశీలనకు ఎన్నికల కమిషన్ అధికారులు రమ్మన్నారని, ఆయన చెప్పారు. మొదట 2002 ఓటర్ల జాబితాలో తన పేరు కనిపించలేదన్నారని, తరువాత గుర్తించినట్టు చెప్పారని బోస్ పేర్కొన్నారు.ఇప్పుడు లింకేజీలో సాంకేతిక సమస్య ఎదురైందని సాకు చెబుతున్నారని, సాంకేతిక సమస్యే ప్రధాన కారణమైతే ఈ లోపానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఈ సవరణ ప్రక్రియ ఓటర్లను తీవ్రంగా వేధించడానికే తప్ప మరేమీ కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలన ఆదరాబాదరాగా ఎన్నికల కమిషన్ చేపట్టడంతో ఎన్నో లోపాలు జరిగాయి. సవరణ చేపట్టక ముందు లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 907 మంది మహిళలు ఉండగా, సవరణ చేపట్టిన తరువాత 892 మందిగా సంఖ్య పడిపోయింది. ముఖ్యంగా 18నుంచి 29 ఏళ్ల వయసు గ్రూపు వారిలో మహిళా ఓటర్లను ‘పెర్మనెంట్లీ షిఫ్టెడ్’ కేటగిరి కింద విచక్షణారహితంగా జాబితాలనుంచి తొలగించడం అత్యంత వివాదాస్పదమైంది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్‌కు కొన్ని సూచనలు చేసింది. అదెంతవరకు ఆచరణలో ఉంటుందో ఎన్నికల కమిషన్ స్పష్టం చేయక తప్పదు.