
చెన్నై: తమిళ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ‘విజిల్’ గుర్తును కేటాయించినట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది. అలాగే, కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి ‘బ్యాటరీ టార్చ్’ను ఎన్నికల గుర్తుగా కేటాయించినట్లు వెల్లడించింది.
కాగా, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో పాటు తమిళనాడు శాసనసభకు ఎన్నికలు.. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం 234 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే..తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే ప్రవేశం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రచార యాత్రను నిర్వహించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.