
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ నగర శివారులోని చెరువులో మిలటరీ శిక్షణ విమానం కూలిపోయింది. ఇందులోని ఇద్దరు పైలట్లు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. విద్యావాహిని పాఠశాల సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ సమాచారం అందగానే ఆర్మీ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. చెరువు నీటిలో ఎయిర్ క్రాఫ్ట్ మునిగి పోగా స్థానికులు పైలట్లను బయటకు తీశారు. సాంకేతిక లోపం కారణం గానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బురద నీటిలో ఉన్న విమాన శకలాలను వెలికి తీసే ప్రక్రియను బృందాలు ప్రారంభించాయి. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆర్మీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.