
సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత పదేళ్లలో అణచివేసిన బీఆర్‌ఎస్ అణచివేసిందని, ఇప్పుడు ఆ జిల్లా కావాలని కేటీఆరే అడగటం విచిత్రంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఈ సమయంలో జిల్లాల పునర్విభజన అనేది సాధ్యంకాదన్న కవిత భవిష్యత్ లో ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ ను జిల్లాగా చేయాల్సిందేనన్నారు. బీసీ కులాల పేర్లు, ఉపకులాలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చేయాల్సిన అధ్యయనాన్ని తామే చేస్తున్నామని, గుంపు మేస్త్రీపై నమ్మకం లేకనే ఈ పని చేస్తున్నామని కవిత తెలిపారు. బుధవారం తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జాగృతి ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీగా మారలేదన్నారు. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
అలాగే ఈ ఎన్నికల్లో తమ మద్దతు కావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు ఎవరు కోరినా ఇస్తామని కవిత వెల్లడించారు.రాజకీయాల్లోకి రావాలనుకునేవారంతా మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత, మహిళలు,బీసీలు, ఎస్సీలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కవిత స్పందించారు. ఈ కేసు తుది దశకు చేరుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని వాపోయారు. ఇక ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలని, వాటితోపాటు ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని కూడా పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేశారన్నారు. అలాంటి ఉద్యమ నేతలెందరికో గత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. జాగృతి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వస్తే శ్రీకాంతాచారి జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహిస్తామని కవిత వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనలో బీసీల సంఖ్యను తక్కువగా చూపి ప్రజలను మోసం చేసిందని కవిత ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం చేపట్టనున్న కులగణనద్వారా ఆ మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని, అందుకోసం జాగృతి ముందడుగు వేస్తోందని, బీసీ మేధావులంతా జాగృతితో కలిసిరావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కావాలనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొచ్చారని కవిత ఆరోపించారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారని, విచారణతో జరిగేదేమీ ఉండదన్నారు. మున్సిపల్ ఎన్నికలు పట్టణాల్లో జరుగుతాయి కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామా ఆడుతున్నారన్నారు. ప్రజల పక్షాన పోరాడుతామంటున్న బీఆర్‌ఎస్ బీసీల కోసం ఎందుకు గొంతెత్తి ప్రశ్నించడం లేదని నిలదీశారు. అధికార కాంగ్రెస్ అయితే బీసీలకు న్యాయం చేయాలన్న విషయాన్ని గురించే ఆలోచించడం లేదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసే బీసీలను మోసం చేస్తున్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు.