Reading Time: < 1 minute

ఇరాన్ తనను హత్యచేస్తే , అమెరికా ఏకంగా మొత్తం ఇరాన్‌నే తుడిచిపెట్టేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుత దశలో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ దశలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ న్యూనేషన్స్ కేటి పావ్లిచ్‌కు ఇంటర్వూ ఇచ్చారు. తనకు ఇరాన్ ఎటువంటి హాని తలపెట్టినా , ఇకపై ఇరాన్ అనేది ఈ భూమిపై ఉండకుండా పోతుందని ట్రంప్ మంగళవారం ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ఇరాన్‌ను శిక్షించేందుకు అవసరం అయిన ఆదేశాలను తాను ప్రెసిడెంట్‌గా ఇప్పటికే ఇచ్చినట్లు వివరించారు. ఖమేనీ, అమెరికా ప్రెసిడెంట్ మధ్య పరస్పర ఘాటు హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇరాన్ అశాంతికి ట్రంప్ కారణం అని ఇటీవల ఖమేనీ విమర్శించారు. కాగా తమ దేశ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీపై ఎటువంటి చర్య తీసకుకున్నా ఊరుకునేది లేదని ఇరాన్ హెచ్చరించింది. తమ నేతపై ఎటువంటి దాడికి దిగే చేతిని అయినా తాము నరికివేయడమే కాకుండా, అటువంటి వారి ప్రపంచాన్ని పూర్తిగా తగులబెడుతామని ఇరాన్ సాయుధ బలగాల అధికార ప్రతినిధి అబోల్ఫజల్ షెకర్చి హెచ్చరించారు. అంతకు ముందు ఖమేనీ పాలన ముగియాలని, అప్పుడే ఇరాన్‌కు శాంతి అని ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఇంటర్వూలో ట్రంప్ తీవ్రస్థాయి వ్యాఖ్యలు వెలువడ్డాయి.