
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అటల్ పెన్షన్ యోజన (ఎపివై) 2030-31 వరకూ కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలిలో కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశం తరువాత అధికారిక ప్రకటన వెలువరించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట ఈ పథకాన్ని 2015 మే 9వ తేదీన ప్రారంభించారు. దీని పరిధిలో ఇప్పటికే 8.66 కోట్లకు పైగా లబ్ధిదారులను చేర్చారు. పథకం 2030 -31 ఆర్థిక సంవత్సరం వరకూ అమలులోకి ఉంటుంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు వయోవృద్ధ ఆదాయ భద్రతను కల్పించే ఉద్ధేశంతో ఈ పథకం తీసుకువచ్చారు. ఈ పథకానికి మరింత ప్రోత్సాహక నిధులు, కేటాయించడం జరుగుతుంది. అసంఘటిత కార్మికుల్లో మరింత ఎక్కువ మందికి ఈ సౌకర్యం కలిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటారు.
ఈ పథకం పరిధిలో కాంట్రిబ్యూషన్ ప్రాతిపదికన రూ 1000 నుంచి రూ 5000 వరకూ కనీస పింఛన్ కార్మికులకు వారి వృద్ధాప్యదశలో అందుతుంది. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత సిడ్బి బ్యాంక్‌కు రూ 5000 కోట్ల మేర ఈక్విటి సపోర్టు కల్పించే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని ఈ స్మాల్ ఇండిస్ట్రిస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అందించడం జరుగుతుంది. దీని వల్ల ఈ బ్యాంక్‌కు అదనపు పెట్టుబడి సమకూరుతుంది. ఈక్విటి సపోర్టుతో ఇకపై ఈ బ్యాంకు ద్వారా సముచిత వడ్డీరేట్లకు వీలేర్పడుతుంది. సూక్ష్మ, చిన్నతరహా , మధ్యస్థ పరిశ్రములు (ఎంఎస్‌ఎంఇ)లకు రుణాల కల్పన సెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈక్విటి కల్పన పెంచడం వల్ల కోటికి పైగా ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుంది. 2027 28 ఆర్థిక సంవత్సరం చివరికి 25 లక్షలకు పైగా కొత్త ఎంఎస్‌ఎంఇ లబ్ధిదారులు చేరుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు.