Reading Time: < 1 minute

“మంత్రుల మధ్య వాటాల పంపిణీలో తేడాలు రావడంతోనే సింగరేణి కుంభకోణం వెలుగులోకి వచ్చింది..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి, కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణ అక్రమాలపై అనేక ఆరోపణలు వచ్చినందున సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తుందని ఆయన తెలిపారు. గతంలో బిఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని బంగారు బాతులా వాడుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. కోల్ బ్లాకులకు సంబంధించి సిబిఐ దర్యాప్తు జరిపించకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమి చేస్తున్నారంటూ కొంత మంది తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. సిబిఐ విచారణకు తప్పని సరిగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందన్న విషయం తెలుసుకోకుండా తనను విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు.గత కొన్ని రోజులుగా సింగరేణికి సంబంధించిన ఒడిశాలోని నైనికోల్ బ్లాక్‌పై చర్చ జరుగుతున్నదని ఆయన తెలిపారు. ఎనిమిది జిల్లాలకు పైగా విస్తరించిన సింగరేణి తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు.