
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించిన దగ్గర నుండి ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు ఓ చిన్న బ్రేక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దానికి సంబంధించిన షూటింగ్ వరుసగా జరిగింది. ఈ చిత్రీకరణ సమయంలోనే ఎన్టీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వరుసగా షూటింగ్‌లో పాలుపంచుకోవడం వల్ల, వాతావరణం సరిగా లేక ఎన్టీఆర్ కు అనారోగ్యం వాటిల్లిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అందువల్ల హీరో విశ్రాంతి తీసుకున్నాకే షూటింగ్ ఆరంభిద్దామని డైరెక్టర్ నీల్ నిర్ణయించడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే, ఈ తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా రాత్రి సమయంలో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తొలుత 2026 జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించినా, ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.