Reading Time: < 1 minute

“బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడును నేను కొట్టలేదు, తిట్టలేదు, అనవసరంగా నాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేపడతా&” అని నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు తాను అన్నాదమ్ముల్ల వలే కలిసి ఉంటామని ఆయన బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు.మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉండడంతో తాను ఎమ్మెల్యే విజయుడు కలిసి పాల్గొన్నామని ఆయన తెలిపారు. విజయుడు బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందినా ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ నుంచి గెలవాల్సిన అవసరం లేదన్నారు. ఇద్దరమూ గెలుపొందినప్పటి నుంచి ప్రజల కోసం పని చేయాలన్న తపనతో ఉన్నామని ఆయన చెప్పారు. కాగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో శంకుస్థాపనం చేసేప్పుడు ఎమ్మెల్యే ముందుగా కొబ్బరి కాయ కొట్టిన తర్వాతే తాను కొట్టానని అన్నారు. తాను ప్రొటోకాల్ గురించి పట్టించుకోలేదని ఆయన తెలిపారు.ఈ సమయంలో ఎమ్మెల్యే అనుచరులమని చెప్పి కొందరు వచ్చి కొబ్బరి కాయల బస్తా ను లాక్కొని ఇక్కడ ఎవరూ ఉండడానికి వీల్లేదంటూ గొడవ చేశారని ఆయన చెప్పారు.

ప్రొటోకాల్ ప్రకారమే కొబ్బరి కాయలు కొట్టిస్తానని తాను వారికి చెప్పానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం తర్వాత కూడా వారు ఇలాగే కొబ్బరి కాయలు గుంజుకున్నారని ఆయన చెప్పారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఆగలేదని, పోలీసులు కొంత దూరంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్ణణ జరుగుతుందని తాను భావించి పోలీసులను పిలిచి కొంత గట్టిగా మాట్లాడానని అన్నారు. గొడవ జరగకుండా ఉండేందుకు తాను ఎమ్మెల్యేను కాస్త పక్కకు తీసుకెళ్ళానని ఆయన తెలిపారు. అంతేతప్ప తాను విజయుడిని ఒక్క మాట అనలేదని, కొట్ట లేదని డాక్టర్ మల్లు రవి వివరించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేనే అడిగి తెలుసుకోవాలని ఆయన అన్నారు. దళితునిపై దాడి జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన ఒక పత్రికకు చెందిన యజమాన్యం, బిఆర్‌ఎస్ నాయకులూ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాను పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేపడతానని డాక్టర్ మల్లు రవి హెచ్చరించారు.