
మాళవిక మోహనన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘కొత్త లోక: చాప్టర్ 1’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సినిమాలో ఆమె నటించలేదు.. కానీ ఈ చిత్రం సృష్టించిన విజయం గురించి ఆమె ప్రశంసలు కురిపించారు.సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు అంటే కేవలం హీరోలవే ఉంటాయని, హీరోయిన్ ప్రధాన పాత్రలో ఉంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రావని నిర్మాతలు భావిస్తారని మాళవిక అభిప్రాయపడ్డారు. అందుకే అవి తక్కువగా వస్తుంటాయి. ఇలాంటి ఆలోచనలకు ‘కొత్త లోక: చాప్టర్ 1’ గట్టి సమాధానం చెప్పిందని ఆమె అన్నారు. ఒక చిన్న సినిమాగా మొదలై, మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రంగా 300 కోట్లకు పైగా వసూలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు.
ఈ సినిమాను నిర్మించిన దుల్కర్ సల్మాన్ కంటెంట్‌ను నమ్మి భారీగా ఖర్చు చేయడం వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని, అదే నమ్మకాన్ని మిగిలిన నిర్మాతలు కూడా చూపాలని ఆమె కోరారు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ‘చంద్ర’ అనే సూపర్ హీరో పాత్రలో నటించారు.ఇది భారతీయ సినిమా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా సూపర్ హీరో ఫాంటసీ థ్రిల్లర్ అని చెప్పవచ్చన్నారు. 2025 ఆగస్టులో విడుదలైన ఈ మలయాళ చిత్రం (తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో) ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది. మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.