Reading Time: < 1 minute

హైదరాబాద్: కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బాపటేల్. అయితే గత కొంతకాలంగా ఈ భామకు పెద్ద సినిమా ఛాన్స్ రావడం లేదు. దీంతో చిన్న, చిన్న సినిమాలు చేస్తూ.. తన ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది. హెబ్బా నటించిన లేటెస్ట్ చిత్రం మారియో. అనిరుధ్ శ్రీవాత్సవ ఇందులో హీరో. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించాడు. నాటకం, తీస్‌మార్ ఖాన్ వంటి చిత్రాలతో కళ్యాణ్ ప్రేక్షకులను మెప్పించాడు.

ఈ సినిమాకి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతం అందించారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. తాజాగా ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ప్రముఖ ఒటిటి సంస్థ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. మరి మారియో చిత్రం బుల్లితెరపై ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.