
న్యూఢిల్లీ: యూట్యూబ్ వీడియోలో బరువు తగ్గే టిప్స్ చూసి.. వాటిని అనుసరించిన ఓ యువతి చివరికి ప్రాణాలనే కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒక యూట్యూబ్ వీడియోలోని చిట్కాల ఆధారంగా స్థానిక దుకాణంలో ఓ పదార్థాన్ని కొని.. దాన్ని తిన్న 19 ఏళ్ల విద్యార్థిని మరణించిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని మీనాంబల్‌పురానికి చెందిన దినసరి కూలీ వేల్ మురుగన్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కలైయరసిగా గుర్తించారు. ఆమె నరిమేడులోని ఓ ప్రైవేట్ మహిళా కళాశాలలో చదువుతోంది.
పోలీసుల ప్రకారం.. సదరు యువతి కొద్దిగా అధిక బరువు ఉన్నందున, బరువు తగ్గడానికి పరిష్కారాల కోసం తరచుగా ఆన్‌లైన్‌లో వెతికేది. ఆమె ఇటీవల బరువు తగ్గే టిప్స్ కోసం యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను చూసింది. ఆ కంటెంట్‌తో ప్రభావితమై, జనవరి 16న కీళమాసి వీధిలోని ఒక ఆయుర్వేద మందుల దుకాణంలో బొరాక్స్ అనే పౌడర్ ను కొనుగోలు చేసింది. జనవరి 17న యువతి, వీడియోలో చూపిన విధంగానే ఆ పదార్థాన్ని సేవించింది. కొద్దిసేపటికే ఆమెకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి.దీంతో తల్లిదండ్రులు వెంటనే ఆమెను మునిసాలైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చింది. అదే రోజు సాయంత్రం ఆ లక్షణాలు మళ్లీ కనిపించాయి. సమీపంలోని మరో ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్ మెంట్ తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. అయితే, రాత్రి 11 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు తీవ్రమవడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే ఆమెను ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యలోనే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తర్వాత ఈ సంఘటనపై సెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.