Reading Time: < 1 minute

విండ్‌హోక్: అండర్‌-19 ప్రపంచకప్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు విల్ మలాజ్‌చుక్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లో శతకం సాధించిన మలాజ్‌చుక్.. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ పేరిట ఉండేది. 2022 ఎడిషన్‌లో ఖాసిం శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ సాధించాడు.

మూడో స్థానంలో భారత ఆటగాడు రాజ్ బవా ఉన్నాడు. 2022 ఎడిషన్‌లో రాజ్ బవా ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే జపాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హ్యూగో కెల్లీ (79 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అయితే 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సులువుగా చేధించింది. మలాక్‌చుక్ మెరుపు శతకం.. నితేశ్ సామ్యూల్ (60 నాటౌట్) రాణించడంతో ఆసీస్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది.