Reading Time: < 1 minute

శివమొగ్గ: ఆ వ్యక్తి ఓ వైద్యుడు కానీ, ఆ వృత్తికే కలంకం తెచ్చాడు. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. చేసి అప్పులు తీర్చడానికి పెద్దమ్మ, పెదనాన్నను కడతేర్చాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలుకా పరిధిలో వృద్ధ దంపతులు చంద్రప్ప, జయమ్మల అనుమానస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. జయమ్మ సోదరి కుమారుడు డా.మల్లేశ్ ఆ ఇద్దరిని హత్య చేసినట్లు నిర్ధారించారు. సోమవారం రాత్రి వారింటికి వెళ్లిన మల్లేశ్ ఇద్దరినీ మాటలతో మాయ చేసినట్లు గుర్తించారు. ఒంటి నొప్పులు తగ్గడానికి ఇంజక్షన్ ఇస్తానని మాయ మాటలు చెప్పి నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలోనే బెడ్‌రూంలో ఉన్న చంద్రప్పకు, టివి చూస్తున్న జయమ్మకు వేర్వేరుగా ఇంజక్షన్లు వేశాడు. వాటి ప్రభావంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని వెళ్లిపోయాడు. మరుసటి రోజు అందరిలా మృతదేహాల వద్దకు వచ్చి కన్నీరు కార్చాడు. ఆ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారనే విషయాలపై పోలీసులు ఆరా తీశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మల్లేశ్ హత్య చేసినట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.