Reading Time: < 1 minute

భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ (124) జట్టును గెలిపించేందుకు పోరాటం చేశాడు. అయిన ఫలితం దక్కలేదు. అయితే తాజాగా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతడి ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి. ఇక సుదీర్ఘ విరామం తర్వాత నెం.1 ర్యాంకు సాధించిన విరాట్ కోహ్లీ.. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

ఇక న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైన రోహిత్ శర్మ 757 పాయింట్లతో మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో 764 పాయింట్లతో ఆఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ నిలిచాడు. 723 పాయింట్లతో శుభ్‌మాన్ గిల్ ఐదో స్థానంలో ఉన్నాడు. 670 పాయింట్లతో కెఎల్ రాహుల్ పదో స్థానంలో 656 పాయింట్లతో శ్రేయస్ అయ్యర్ 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టి-20 ర్యాంకింగ్స్‌తో 908 పాయింట్లతో అభిషేక్ శర్మ మొదటిస్థానంలో 805 పాయింట్లతో తిలక్ వర్మ మూడో స్థానంలో ఉన్నారు.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 880 పాయింట్లతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తొలి స్థానంలో ఉండగా.. 750 పాయింట్లతో యశస్వి జైస్వాల్ ఎనిమిది, 730 పాయింట్లతో శుభ్‌మాన్ గిల్ పదో స్థానంలో ఉన్నారు. టెస్ట్ బౌలింగ్‌లో బుమ్రా (879 పాయింట్లు), టి20ల్లో వరుణ్ చక్రవర్తి (804 పాయింట్లు), వన్డేల్లో రషీద్ ఖాన్ (710 పాయింట్ల) తొలిస్థానాల్లో నిలిచారు.