
టీం ఇండియా ‘కింగ్’ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో 240 పరుగులు సాధించాడు. చివరి వన్డేలో 108 బంతుల్లో 124 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు కృషి చేశాడు. అయితే వన్డే జట్టులో చోటు దక్కాలంటే.. దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అంటూ బిసిసిఐ విరాట్ వంటి సీనియర్ ప్లేయర్లకు కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నాడు. అయితే తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ విరాట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని కైఫ్ అన్నాడు. ‘‘విరాట్ లండన్ నుంచి వస్తున్నాడు.. పరుగులు సాధిస్తున్నాడు.. మళ్లీ వెళ్తున్నాడు. రెగ్యులర్‌గా ఆడకున్నా.. ఇలా నిలకడగా పరుగులు రాబట్టడం అంత తేలిక కాదు. అతడి ఫిట్‌నెస్, క్రికెట్‌పై అతడి అంకితభావం, స్వీయ సన్నద్ధత అద్భుతం. ప్రస్తుతం అతడు దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ప్రాక్టీస్ ఎవరైనా పొందుతారు. కానీ, ఆటపై అతడికున్న ఆ అభిరుచిని ఇతరులు పొందడం సాధ్యం కాదు. ఇది మార్కెట్‌లో దొరకదు. అతడు చివరి వన్డేలోనూ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు’’ అని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నాడు.