
వెనెజువెలా విపక్షనేత, ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు మరియా కొరినా మచాడో తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని నోబెల్ కమిటీ నియమాలకు విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అందచేయటం శోచనీయం. డొనాల్డ్ ట్రంప్‌ను మచ్చిక చేసుకుని వెనెజువెలా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికే మచాడో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తున్నది. వెనెజువెలా లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం కోసం మరియా కొరినా మచాడో ప్రతిపక్షాలన్నింటినీ ఏకత్రాటిపైకితెచ్చి ఉద్యమిస్తున్న క్రమంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకంజ వేయలేదు. న్యాయమైన హక్కుల కోసం, నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించాలనే ధ్యేయంతో ఉద్యమ నాయకురాలిగా, వెనెజువెలా పార్లమెంటు సభ్యురాలిగా శాంతియుత పోరాటం చేసిన మచాడో తీరు మారింది. మదురో నిర్భంధం తర్వాత ఆమెలో పదవీ కాంక్ష పెరిగింది. మచాడోను వ్యతిరేకించిన ట్రంప్ కూడా ప్రస్తుతం నోబెల్ బహుమతిని తనకిచ్చినందుకు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తడం విడ్డూరం.
వెనెజువెలా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసి తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడినంటూ ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు మచాడో వత్తాసు పలకడం అక్కడి ప్రజల భవిష్యత్తును పెనంమీద నుంచి పొయ్యిలో పడేసిన చందంగా ఉంది. ఇప్పటికే వెనెజువెలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగి పోయాయి. కేవలం కొద్దిమంది చేతుల్లోనే సంపదంతా కేంద్రీకృతమైపోయింది. భారీ సంఖ్యలో ప్రజలు పేదరికం తట్టుకోలేక ఇతర దేశాలకు వలసపోతున్నారు. వెనెజువెలాలో ఇలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని, పారదర్శకమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో అమెరికా వెనెజువెలా అధ్యక్షుడిని నిర్బంధించి న్యూయార్క్‌కు తరలించుకుపోవడం వెనెజువెలా సార్వభౌమత్వాన్ని పరిహసించడం కాదా? నార్కో టెర్రరిజం పేరుతో మదురోపై నిందారోపణలు చేసిన అమెరికాకు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అందుకు తగిన విధమైన చర్యలు తీసుకునే అవకాశమున్నా, అందుకు విరుద్ధంగా కారకాస్‌పై దాడి చేయడం గతంలో ట్రంప్‌పై మదురో చేసిన వ్యాఖ్యలకు ప్రతీకార ధోరణి తీర్చుకున్నట్టుగా ఉంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో పదవీచ్యుతి, నిర్బంధం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి.
రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా కారకాస్‌పై అమెరికా సాగించిన సాయుధ దుస్సాహసాన్ని ప్రపంచ శాంతికి విఘాతంలా పేర్కొన్నాయి. అమెరికాలోని కొంత మంది విపక్ష సభ్యులతోపాటు, స్వపక్షంలోని నేతలు, అమెరికా ప్రజలు ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. అయితే ఇంత తతంగం జరుగుతున్నా, వెనెజువెలా అమెరికా గుప్పెట్లోకి జారిపోయినా, తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సైతం అమెరికా చెప్పుచేతల్లోనే పని చేసి, అమెరికాకు చమురు దోచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా, వెనెజువెలా ప్రజలు మాత్రం అమెరికా దాడిని, జరుగుతున్న సంఘటనలను పెద్దగా పట్టించుకోవడం లేదు. నిజానికి అపారమైన చమురు నిల్వలు గల వెనెజువెలా అత్యంత సంపన్న దేశంగా ఉండాలి. కాని పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. వెనెజువెలా ఆర్థికంగా వెనకబడే ఉంది. కారుచవకగా చమురు ఎగుమతులు చేయడం వలన ఇతర చమురు సంపన్న దేశాల కంటే, వెనెజువెలాకు చమురు వలన లభించే ఆదాయం పడిపోయింది. కేవలం చమురుమీద ఆధారపడడం, ఇతర రంగాలను నిర్లక్ష్యం చేయడం, చమురు ధరలు తగ్గినప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం వంటి పరిణామాలు అక్కడ జరుగుతున్నాయి.
అమెరికా ఆంక్షలు కూడా వెనెజువెలా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసాయి. ఆదాయం తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరింది. సౌదీ అరేబియా, అమెరికాల కంటే వెనెజువెలాలో అధిక నిరూపిత చమురు నిల్వలు (ప్రోవెన్ ఆయిల్ రిజర్వులు) కలిగి ఉన్నా, ఆదాయం మాత్రం అతి తక్కువగానే ఉంది. ‘రిచ్ ఇన్ ఆయిల్- పూర్ ఇన్ వెల్త్’ గా వెనిజులా ఆర్థిక ముఖచిత్రం మారింది. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 10 వ బలమైన ఆర్థిక వ్యవస్థగా, బలమైన ఆదాయ వనరులున్న దేశంగా ఎదిగి స్వర్గధామంలా విలసిల్లిన వెనెజువెలా నేడెందుకు దీనంగా మారింది? వెనెజువెలాలో చమురు వెలికితీయడం, శుద్ధిచేయడం వంటి ప్రక్రియ ఖరీదైన వ్యవహారం కావడంతో కార్పొరేట్లు ఈ అవకాశం అందిపుచ్చుకుని దేశాభివృద్ధిలో పాలు పంచుకున్నారు. ఇది నచ్చని అప్పటి వెనెజువెలా అధ్యక్షుడు హ్యోగో చావెజ్ చమురు బావులను ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి దూరం చేసాడు. పెట్టుబడిదారులను వెళ్ళగొట్టాడు. ప్రజలను ఉచిత పథకాలపేరుతో బిచ్చగాళ్లుగా చేసి, వారిని పని చేయనీయకుండా సోమరిపోతులుగా మలచి, ఇంటికే పరిమితం చేసి తాను ఆడిందే ఆటగా, పాడిందే పాటగా దేశాన్ని ఆర్థికంగా నాశనం చేసి, ప్రజలను ఉచితాలతో మభ్యపెట్టాడు.
సుఖాలకు అలవాటు పడ్డ వెనెజువెలా ప్రజలు చావెజ్‌ను మెచ్చుకుంటూ కాలక్షేపం చేసారు. దేశంలో ఉత్పాదకశక్తి క్షీణించిపోయింది. పని చేయడం బద్దకంగా మారింది. అన్ని రంగాలు క్షీణించాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజలు ఆకలితో అలమటించి, పొట్ట చేత పట్టుకుని దేశం వదలిపోయారు. బలమైన ఆర్థిక వ్యవస్థ అప్పుల పాలైనది. పెట్టుబడులు పెట్టేవారు కరువైనారు. చావెజ్ ప్రజల మానసిక దౌర్బల్యాన్ని ఉచిత పథకాలతో మాయచేసి తనకు అనుకూలంగా మలచుకుని అధికారం చెలాయించాడు. శ్రమశక్తిని విచ్ఛిన్నం చేసి, శ్రమించడాన్ని తెలివి తక్కువ తనంగా భావించి, ప్రజలను ఉచితాల విందులో తేలియాడించి, దేశాన్ని అధోగతిపాలు చేసాడు. చివరకు అత్యధిక విలువ గల అతి పెద్ద నోటును వెనెజువెలా ప్రభుత్వం ముద్రించింది. తిండి పెట్టలేని కరెన్సీ నోట్ల కట్టలను ప్రజలు చెత్తకుప్పల్లో పడేశారు. చావెజ్ మరణానంతరం నికోలస్ మదురో వెనిజులా అధ్యక్షుడై, నియంతగా మారి, ఎన్నికలను బూటకంగా మార్చి ప్రతిపక్షాలను అణచివేసి పాలన సాగించాడు. ఉచితాలను మరిగిన ప్రజలు దేశం దివాలా తీయడంతో గగ్గోలుపెట్టారు. దేశం లో ఆకలి కేకలు మిన్నంటాయి. దాదాపు 80% మందికి పైగా ప్రజలు ఉపాధి లేక తిండి లేక బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా దేశాలకు వలసపోయారు. సంపన్న దేశం పాలకుల అధికార దాహంతో, దూరదృష్టి లేని పాలనతో అడుక్కుతినే పరిస్థితిలోకి నెట్టబడింది. వెనెజువెలా ఆర్థిక పతనానికి దారితీసిన పాలకుల అనాలోచితమైన ఆర్థిక విధానాల ఘోర వైఫల్యాల ఫలితాన్ని అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారు. చైనా బిలియన్ల డాలర్ల కొద్దీ వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టింది.
వెనెజువెలా తీసుకున్న అప్పులకు బదులుగా చైనా దాని నుండి కారుచవకగా చమురు కొనుగోలు చేస్తున్నది. చమురు క్షేత్రాలపైనే కాకుండా, పలు రంగాల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. వెనెజువెలాపై అమెరికా జరిపిన దాడి వలన, వెనెజువెలా అమెరికాకు పాదాక్రాంతం కావడం వలన చైనాకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. భారత్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ రూపంలో భారత్ అనేక క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను తట్టుకుంటూ వేరే మార్గంలో ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ, దేశం ఆర్థికంగా ముందుకు సాగడానికి కృషి చేస్తున్నది. ట్రంప్ భారత్‌ను ‘డెడ్ ఎకానమీ’గా అభివర్ణించినా, అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించినా, భారతీయ విద్యార్ధులపై, ఉద్యోగులపై వీసాల భారం మోపుతూ, భారతీయుల ఉద్యోగాలకు ఎసరు పెట్టాలని చూస్తున్నా ఇంతవరకు భారత్ అమెరికాను గాని, ట్రంప్‌ను గాని పల్లెత్తుమాట అనకుండా, బలవంతునితో వైరం ప్రమాదకరమన్న రీతిలో సహనం పాటించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రపంచం ఒకప్పటిలా గిరిగీసుకుని కూర్చునే పరిస్థితులు లేవు. ప్రతీ దేశానికి ఇతర దేశాలతో అవసరం ఏర్పడింది. వాణిజ్య, సాంకేతిక రక్షణావసరాలు ప్రపంచ దేశాల మనుగడకు అవసరం. అయితే అమెరికాలో ట్రంప్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. తనను వ్యతిరేకిస్తున్న దేశాలతో ఎవరూ సంబంధాలు పెట్టుకోవద్దంటూ ట్రంప్ బెదిరించడం, అందుకు తగ్గట్టుగానే కక్షసాధింపు చర్యలకు దిగడం వలన భారత్ తోపాటు అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ పరిస్థితులు మారాలని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. వెనెజువెలా దుస్థితి తమకు రాకూడదని చిన్నచితకా దేశాలు మౌనంగా ఉంటున్నాయి. వెనెజువెలా విషయంలో అమెరికా ఘోరతప్పిదం చేసిందని అనేక దేశాలు భావిస్తున్నప్పటికీ, బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పడానికి భయపడుతున్నాయి. మదురోను వెంటనే విడుదల చేయాలని రష్యా డిమాండ్ చేసింది. వెనెజువెలాను ఆక్రమించాలన్న దురుద్దేశం తమకు లేదని, కేవలం నేరారోపణలపైనే మదురోను అరెస్టు చేసామని అమెరికా ఒకవైపు చెబుతూనే, వెనెజువెలా చమురును తమ ప్రత్యర్థి దేశాలకు విక్రయించవద్దని, రష్యా చైనా, ఇరాన్, క్యూబా దేశాలను పక్కనబెట్టాలని అమెరికా హుకుం జారీ చేయడం దేనికి సంకేతం? ఒక వైపు వెనెజువెలాపై సాయుధ దాడి చేయడం, మరోవైపు గ్రీన్‌లాండ్ ఆక్రమణకు సంసిద్ధం కావడం, క్యూబా, మెక్సికోలను హెచ్చరించడం అమెరికా దురహంకార ఆధిపత్య ధోరణికి దర్పణం పడుతున్నది. ప్రస్తుతం ఇరాన్- అమెరికాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ ధోరణి మధ్యప్రాచ్యంలో అశాంతికి పురిగొల్పుతున్నది. ఈ పరిస్థితులనుండి ప్రపంచాన్ని కాపాడేవారెవరు? ట్రంప్ ధోరణి ఇలాగే కొనసాగితే చైనా, రష్యాలతోపాటు మరికొన్ని అమెరికా వ్యతిరేక దేశాలు కూటమిగా ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితులు మరో మహాసంగ్రామం వైపు దారితీయవచ్చు. ఈ సారి ప్రపంచ యుద్ధం గనుక సంభవిస్తే అణుబాంబులతో యావత్ భూగోళం భస్మీపటలం కాక తప్పదు.
సుంకవల్లి సత్తిరాజు
97049 03463