Reading Time: 2 minutes

మొండివాడు రాజుకంటే బలవంతుడంటారు. కానీ, రాజే మొండివాడైతే ఇక చెప్పేందుకు ఏముంటుంది? అగ్రరాజ్యం అమెరికాను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏడాది క్రితం రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ముందువరకూ ప్రపంచ దేశాలకు అమెరికా పెద్ద దిక్కుగా ఉంటూ, పెద్దన్న పెత్తనం చెలాయించేది. మంచీచెడూ చెబుతూ, వీలైనంతవరకూ దేశాల మధ్య ఘర్షణలను నివారిస్తూ, తలలో నాలుకగా వ్యవహరించేది. ఒకవైపు స్వీయ ప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే, ఇతర దేశాల పట్ల సహానుభూతిని కనబరిచేది. ట్రంప్ వచ్చాక ఈ పరిస్థితిలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశ ప్రయోజనాల పేరిట ఇతర దేశాల ఆక్రమణకు సైతం అమెరికా తెగబడుతోంది. మొన్నటికి మొన్న మాదక ద్రవ్యాలను అమెరికాకు దొంగచాటుగా పంపిస్తున్నారనే నెపంతో సైనికదాడి జరిపి, వెనెజువెలా అధ్యక్షుడిని నిర్బంధించి, అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ట్రంప్ కన్ను గ్రీన్‌లాండ్‌పై పడింది.

డెన్మార్క్ దేశంలో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునే క్రమంలో ఆయన ఇతర దేశాలతో వైరాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా పేరొందిన గ్రీన్‌లాండ్ ను దక్కించుకోవాలనే అమెరికా ఆలోచన ఈనాటిది కాదు. దాదాపు ఎనభై ఏళ్ల క్రితమే గ్రీన్‌లాండ్ కోసం 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని అమెరికా ఇవ్వజూపితే, డెన్మార్క్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. భౌగోళికంగా డెన్మార్క్ దేశంలో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌కు 1979లో జరిగిన రెఫరెండంలో స్వయంప్రతిపత్తి లభించింది. అయినప్పటికీ రక్షణ, విదేశీ వ్యవహారాలను డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది. అటు రష్యా, బ్రిటన్, ఇటు అమెరికా, పలు ఐరోపా దేశాలకు నడిమధ్యన ఉండటంతో గ్రీన్‌లాండ్ అనేక దేశాలకు కీలకప్రాంతంగా మారింది. ఈ ప్రాంతంపై అమెరికాయే కాదు, రష్యా, చైనా కూడా కన్నువేశాయి. ఇప్పుడు తాము గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోకపోతే, ఆ పనిని రష్యా లేదా చైనా చేస్తాయన్న ట్రంప్ వాదన అర్థరహితం. అమెరికాకు భద్రతపరంగా గ్రీన్‌లాండ్ వ్యూహాత్మక ప్రాంతం అయితే కావచ్చు. అంతమాత్రాన నయానో భయానో డెన్మార్క్ మెడలు వంచి, గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలనే దురాలోచన సహించరానిది.

అంతర్జాతీయ చట్టాలను తోసిరాజని ట్రంప్ సాగిస్తున్న దురాక్రమణ ఇతర దేశాలకు ఒక తప్పుడు ఉదాహరణగా మారే ప్రమాదం లేకపోలేదు. అమెరికా బాటలోనే నడిచి, తైవాన్‌ను చైనా ఆక్రమించుకుంటే ఏం చేస్తారన్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల ప్రశ్నకు ట్రంప్ వద్ద సమాధానం లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరొందిన అమెరికా.. ట్రంప్ నాయకత్వంలో తిరోగమన పథంలో పయనిస్తోందనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలన్న ట్రంప్ దురుద్దేశానికి కేవలం భద్రతాపరమైన అంశాలే కాదు, ఆ ప్రాంతంలో దొరికే అరుదైన ఖనిజాలు కూడా కారణమని చెప్పవచ్చు. ఎనభై శాతం మంచుతో నిండి ఉండే గ్రీన్‌లాండ్‌లో నికెల్, కోబాల్ట్, బంగారం వంటి నిక్షేపాలు అపారంగా ఉన్నాయన్న సంగతి గమనార్హం. నాటోలో అమెరికా, డెన్మార్క్.. రెండూ సభ్యత్వ దేశాలే. యురోపియన్ యూనియన్ (ఇయు) లోనూ డెన్మార్క్ సభ్యత్వ దేశం కావడంతో తాజా పరిణామం అమెరికాకు, ఇయు దేశాలకూ మధ్య వైరంగా మారుతోంది. తన దురాక్రమణ యత్నాన్ని ఖండించాయన్న అక్కసుతో ఎనిమిది ఇయు దేశాలపై ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించారు.

ఇందుకు ప్రతిగా అమెరికాపై ట్రేడ్ బజూకా అస్త్రాన్ని ప్రయోగించాలని ఇయు దేశాలు యోచిస్తున్నాయి. భారీ సుంకాలు, ఆర్థిక ఆంక్షలు విధించి, ఆర్థికంగా తమను దెబ్బ తీయాలనుకున్న దేశాల పెట్టుబడులను తిరస్కరించడం, ఆయా దేశాల దిగుమతులపై అదనపు సుంకాలు విధించడం వంటి నిబంధనలతో యురోపియన్ యూనియన్ దేశాలు రూపొందించుకున్న సరికొత్త వాణిజ్య విధానమే ట్రేడ్ బజూకా. ట్రంప్ తమపై విధించిన సుంకాలకు బదులుగా అమెరికా ఉత్పత్తులపై 9300 కోట్ల యూరోల సుంకాలు విధించాలని నిర్ణయించిన ఇయు దేశాలు, దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు త్వరలో భేటీ కాబోతున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పకపోవచ్చు. సుంకాల రంకెలు వేస్తున్న ట్రంప్‌కు ముకుతాడు వేసేందుకు ఇంతకుమించిన మరో మార్గం ఇతర దేశాలకు కనిపించడం లేదన్న సంగతి అర్థం చేసుకోదగినదే. ఈ ప్రయత్నంలో ఇతర దేశాలనూ కలుపుకుని పోవడంవల్ల అమెరికాను అదుపు చేసే అవకాశం ఉండవచ్చు.