Reading Time: 2 minutes

ప్రపంచ వ్యవహారాల్లో చమురు ఎంత ప్రముఖ స్థానం వహిస్తుందో, దానితో సాగే ధరల ఒడిదుడుకులు రాజకీయాలపై చూపే ప్రభావాన్ని చూస్తే స్పష్టమవుతుంది. బ్రూనై, కతార్ వంటి చిన్నదేశాలు కూడా తమ భూగర్భంలో దాచి ఉంచిన ఈ నల్లసంపద వల్ల ప్రపంచంలో గుర్తింపును పొందాయి. కానీ ఈ సంపద వారికి నిజమైన స్థిరత్వాన్ని, శాంతిని కల్పించిందా అనేది ఓ పెద్ద ప్రశ్నగా మిగిలింది. మరొక వైపు భారతదేశం వంటి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చమురు అనేది అత్యవసరమైనది. కానీ ఎక్కువ శాతం దిగుమతి పైనే ఆధారం. ఈ ఇంధన కొరత మన ఆర్థిక విధాన రూపకర్తల ముందు నిరంతరం ఒక సవాలుగా నిలుస్తున్నది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు. ప్రతి రోజూ దాదాపుగా 50 లక్షల బ్యారెళ్లకు పైగా దిగుమతి అవసరం ఉంటుంది.

ఇది మన మొత్తం వినియోగంలో 80% కంటే ఎక్కువ. మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, రవాణా వ్యవస్థ విస్తరణకు అనుగుణంగా ఈ డిమాండ్ మరింత పెరగనున్నది. ఈ పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా చాలా సున్నితంగా మన దేశం కూడా విధిగా నడుచుకోవాలి. ప్రతి డాలరు ధర పెరుగుదల లేదా తగ్గుదల మన వాణిజ్య లోటు, రూపాయి విలువ, ద్రవ్యోల్బణంపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. 2026 ప్రారంభంలో అంతర్జాతీయ చమురు మార్కెట్ మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి. వెనెజువెలాలోని రాజకీయ మార్పు, ఇరాన్, రష్యాలపై పరిమితులు సడలడం వంటి అంశాలు చమురు సరఫరాను పెంచి, ధరలను ఒత్తిడికి లోను చేయగలవు. కొందరు విశ్లేషకులు బ్యారెలుకు 55 డాలర్ల స్థాయికి ధరలు కిందకు పడిపోతాయని అంచనా వేస్తున్నారు. అలా నిజంగా జరిగితే భారతదేశానికి ఒక పెద్ద ఆర్థిక ఊరటగా ఉంటుంది.

ప్రస్తుతం మన దేశం ఒక బ్యారెలుకు సుమారు 70 డాలర్లు చెల్లిస్తుంది. నిజంగా ఆయిల్ ధరలు కుప్పకూలినప్పుడు ప్రతి బ్యారెలుకు కేవలం ఒక డాలర్ ధర తగ్గినా రోజుకు 50 లక్షల బ్యారెళ్ల దిగుమతి భారం తగ్గుతుంది. సంవత్సరానికి లక్షల కోట్లు ఆదా అవుతాయి. ఈ పొదుపు స్థూల ఆర్థిక స్థిరత్వానికి, అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ద్రవ్యోల్బణ నియంత్రణకు దోహదపడుతుంది. కానీ, ఈ హఠాత్తు అవకాశాన్ని మనం శాశ్వతమైన పరిష్కారంగా భావించకూడదు. చమురు మార్కెట్లు ఎప్పుడూ అస్థిరంగానే ఉంటాయి. అలాగే అంతర్జాతీయ రాజకీయ ఉధృతాలతో మార్పు చెందుతూ ఉంటాయి. ఇటీవలి చరిత్ర చూస్తే 2014లో బ్యారెలుకు 140 డాలర్లు నుండి 2016లో 30 డాలర్లకు కిందకు పడిపోయాయి. మనం సంతోషం పడే లోపే మళ్లీ ఒక్కసారిగా 100 డాలర్లపైకి ఎగసిపడిన అనుభవాలు ఉన్నాయి. అందువల్ల, తాత్కాలిక ధరల తగ్గుదలను స్వాగతించనా, మనకంటూ ఒక దీర్ఘకాలిక వ్యూహం అవసరం. మన ఆధారపాటును తగ్గించడంపై దృష్టి పెట్టాలి.

ఇక్కడే చమురు సంపద విరుద్ధార్థం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మధ్యప్రాచ్యం, వెనెజువెలా లేదా రష్యా వంటి దేశాల చరిత్రలను చూస్తే ఈ ‘నల్లబంగారం’ తరచూ రాజకీయ అస్థిరత, విలాసవంతమైన వ్యయం, అంతర్జాతీయ వివాదాలకు దారి తీసింది. సంపద నిర్వహణలో సృజనాత్మకత, సమగ్ర సూత్రదృష్టి లేకపోవడం ఈ దేశాలను ‘చమురు శాపానికి’ గురిచేసింది. భారతదేశం చమురు సంపదలో దరిద్రంగా ఉండటం ఒక విధంగా, ఈ రకమైన రాజకీయ- ఆర్థిక చిక్కుల నుండి తప్పించుకున్నందుకు అదృష్టంగా కూడా భావించవచ్చు. ఇది మనల్ని వివేకం, ఇన్నోవేషన్‌తో ఆర్థిక వ్యవస్థను నిర్మించే బాధ్యత వహించేలా చేసింది. అందువల్ల, భారతదేశం ప్రాథమిక లక్ష్యం చమురు ధరలలో తాత్కాలిక హెచ్చుతగ్గుల నుండి లాభం పొందడం మాత్రమే కాక, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగవంతమైన మార్పుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా అయి ఉండాలి.

2026లో చమురు ధరలు తగ్గే అవకాశం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక అవసరమైన ఊపు నివ్వగలదు. ఈ పరిస్థితిని మనం ఒక వరంగా భావించి, మన ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అధిక దిగుమతి ఖర్చు వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించిన ఈ సమయంలో, సంచిత పొదుపును పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పెట్టుబడి, విద్యుత్ వాహనాల ప్రోత్సాహం, శక్తిసామర్థ్యత పెంపుదల వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. భవిష్యత్తు స్థిరమైన, స్వావలంబన ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా ఈ అవకాశాన్ని మార్చుకోవడంలోనే మన నిజమైన విజయం నిలుస్తుంది. చమురు శాపం నుండి బయటపడి, సౌరశక్తి వంటి నిర్మలమైన శక్తి వైపు మారడమే ఈ శతాబ్దపు అతిపెద్ద సవాలు, అవకాశం కూడా.

కోలాహలం రామ్ కిశోర్, 98493 28496