Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: భారత్ లో జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్‌ లో బంగ్లాదేశ్ జట్టు ఆడుతుందా?.. లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే, తాము భారత్ లో ఆడబోమని బంగ్లా పట్టుబడుతోంది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) బుధవారం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఈ వివాదంలోకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంటరైనట్లు తెలుస్తోంది. భద్రతా కారణాలను చూపుతూ, ఈ మెగా ఈవెంట్ కోసం తమ జాతీయ జట్టును ఇండియాకు పంపకూడదనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) వైఖరికి మద్దతు తెలుపుతూ ఐసిసికి పాక్ లేఖ రాసింది.

అంతకుముందు, బంగ్లాదేశ్ ప్రపంచ కప్ మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో నిర్వహించడానికి పిసిబి ప్రతిపాదించిందనే ఊహాగానాల వచ్చాయి. అంతేకాకుండా, బంగ్లాదేశ్ విషయంలో ఏం జరుగుతుందో దానిపై ఆధారపడి ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ భాగస్వామ్యాన్ని పిసిబి సమీక్షిస్తోందని కూడా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, వీటిని పిసిబి అధికారి గానీ, దాని వర్గాలు గానీ ధృవీకరించలేదు.

ఇదిలా ఉంటే..బంగ్లాదేశ్ వైఖరికి మద్దతుగా పిసిబి లేఖ రాయడం వల్ల ఐసిసి తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ప్రపంచ కప్ షెడ్యూల్‌ను మార్చకుండా, బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడేందుకు అనుమతించాలనే దానిపై ఐసిసి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన చర్చల సందర్భంగా ఐసిసి ఈ విషయాన్ని బిసిబికి స్పష్టం చేసింది. ఈ సమస్యపై చర్చించడానికి ఇరు పక్షాలు చాలాసార్లు సమావేశమయ్యాయి.అయినా, దీనిపై స్పష్టత రాలేదు. దీంతో ఇవాళ ఐసిసి మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుండి వైదొలిగితే, కొత్త జట్టుకు టీ20 ప్రపంచ కప్‌కు సిద్ధం కావడానికి కనీసం 15 రోజుల సమయం లభించేలా.. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి ఐసిసి జనవరి 21ని గడువుగా నిర్ణయించింది. కాగా, ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.