Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డి బావమరిది సుజన్‌రెడ్డికి సింగరేణి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమ నేత హరీశ్‌రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డేనని, ఈ కుంభకోణంలో సృజన్ రెడ్డి కింగ్ పిన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించిందని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా మైనస్ టెండర్లు పడే చోట అంచనా విలువకన్నా అధికంగా టెండర్లు వేశారని చెప్పారు. రేవంత్‌రెడ్డి బావమరిది కుంభకోణం బయట పెట్టినందుకే హరీశ్‌రావును విచారణపేరుతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లొసుగులు బయటపెట్టిన ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు బొగ్గు కుంభకోణంలో బయటపెట్టిన సమాచారం తప్పు అయితే సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటివరకు ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. గతంలో హరీశ్‌రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని, అయినా ఆయనను సిట్ విచారణకు పిలిచారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కంటే రేవంత్‌రెడ్డి సిట్ పెద్దదా..? అని ప్రశ్నించారు.

సైట్ విజిట్ నిబంధన దేశంలో ఎక్కడా లేదు

సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తీసుకువచ్చి ఎవరు టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారని కెటిఆర్ మండిపడ్డారు. వేల కోట్లతో ముడిపడిన టెండర్ల విషయంలో సైట్ విజిట్ చేయాలనే నిబంధన పెట్టి, ఇతర రాష్ట్రాలు, విదేశీ సంస్థలు బిడ్ వేయకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సైట్ విజిట్‌కు వచ్చిన కాంట్రాక్టర్లను రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. టెండర్లు వేసిన కంపెనీ కచ్చితంగా సైట్ విజిట్ చేయాలన్న నిబంధన దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్టారని తెలిపారు.

కుంభకోణంలో కిషన్‌రెడ్డికి వాటా

బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉందని కెటిఆర్ ఆరోపించారు. అందుకే కోల్ మినిస్టర్ కిషన్‌రెడ్డి, ఈ విషయంలో మౌనంగా ఉన్నారని చెప్పారు. నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంపై కేంద్రం చూసీ చూడనట్లుగా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పుడు పట్టించుకోరా..? అని ప్రశ్నించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మౌనంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? అని అడిగారు. ఆయనకు ఏమైనా వాటాలు అందుతున్నాయా..? అని నిలదీశారు.దొంగలు దొరకాలంటే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. నైనీ ఒక్కటే రద్దు చేస్తే సరిపోదని.. సృజన్ రెడ్డి దక్కించుకున్న టెండర్లు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.