Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యమని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రె డ్డి పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవల ను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభు త్వ లక్ష్యమని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లూఈఎఫ్) ఆధ్వర్యం లో దావోస్‌లో నిర్వహించిన ‘ఇంటెలిజెంట్ ఇ న్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కంపెటిటివ్ నెస్’ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకొని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందిం చే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన తెలిపారు. వ్యవస్థలోని మేథస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అధునాతన ఏఐ యుగంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండలేవని, ముందస్తు చర్యలు తీసుకోవడం, వేగంగా నిర్ణయాలు అమలు చేయడమే కీలకమని ఏఐ ప్ర భావం గురించి సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

‘తెలంగాణ రైజింగ్2047’ విజన్ గురించి ముఖ్యమంత్రి వివరిస్తూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు కేం ద్రంగా మారిందని, అన్ని రంగాలకు చెందిన అ గ్రశ్రేణి కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. పె ట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండాలంటే మేథోవంతమైన వ్యవస్థలను నిర్మించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సదస్సులో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య మంత్రి హస్సన్ ఎల్కహతీబ్, ఎమరాల్ ఏఐ సీఈఓ వరుణ్ శివరామ్, ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (డబ్య్లూఐపిఓ) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, జర్మనీ డిజిటల్ మంత్రిత్వ శాఖ మంత్రి కార్ స్టెన్ వైల్ బెర్గర్, నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈఓ తోషియాకి టోకునాగా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

జ్యురిచ్ విమానాశ్రయంలో సిఎం బృందానికి ఘనస్వాగతం

ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు-2026 లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ మంగళవారం ఉదయం చేరుకుంది. జ్యురిచ్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్‌కు ప్రవాస తెలంగాణ వాసులతో పాటు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. సిఎం రేవంత్‌తో భారత రాయబారి మృదుల్ కుమార్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఉండగా, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో తెలంగాణ బృందం అత్యంత కీలకంగా వ్యవహారించనుంది.

ఈ పర్యటనలో ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్ ను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. గత డిసెంబర్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా, రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. తొలిరోజు నుంచి ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక విధానాలు, భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను ఆయన వివరించనున్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న ఈ పర్యటనపై రాష్ట్రవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

మొదటి రోజున బిజీ బిజీగా

దావోస్‌లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజున బిజీ బిజీగా గడిపారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్ తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సిఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషీ యల్ ఇంటెలిజెన్స్, డీప్టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్‌టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరో స్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకుంటుంది. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయిల్ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది.