
కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా ఓ భార్య చంపేసిన ఘటన కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీలో చోటుచేసుకుంది. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో అసలు గుట్టు వీడింది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం..సుధీర్ రెడ్డి(44), ప్రసన్న దంపతులు. దంపతులిద్దరూ కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓసారి సుధీర్ రెడ్డిని చంపేందుకు ప్రసన్న ప్రయత్నించి విఫలం అయ్యింది. గత నెల 24వ తేదీన సుధీర్ రెడ్డి మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు ఉంది. సుధీర్ రెడ్డి మృతిపై అనుమానంతో సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సుధీర్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య ప్రసన్నను విచారించగా తానే హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకొంది. అక్రమ సంబంధానికి, జల్సాలకు అడ్డుగా ఉన్నాడనే కారణంగానే సుధీర్ రెడ్డిని చంపేసినట్లు చెప్పింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.