
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై పదే పదే చెప్తున్నా ధరలు పెంచుకునేందుకు మోమో ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ కార్యదర్శికి హైకోర్టు ధర్మాసనం ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోం శాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టులో జస్టిస్ ఎన్‌వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారించారు. గత ఆదేశాలను ధిక్కరిస్తూ మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి ధరలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై కోర్టు సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. సినిమా నిర్మాతలు టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ జారీ చేసిన మెమో హైకోర్టు ఆదేశాలు, నిబంధనలను ఉల్లంఘించిందని, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ. 50,
మల్టీప్లెక్స్‌లకు రూ. 100 పెంచడాన్ని అనుమతించే చట్టబద్ధతను ఏడు రోజుల పాటు ప్రశ్నించిందని న్యాయవాది విజయ్ గోపాల్ వాదించారు. మెమోను సస్పెండ్ చేయాలని, ఆ అధికారిపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని కోర్టును కోరారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ల రేట్లు పెంచిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచిపెట్టారంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే సివి ఆనంద్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్-1955 ప్రకారమే ధరల నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకునేటప్పుడు 90 రోజుల ముందే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా మళ్లీ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది.