
బాధితులకు మరింత చేరువగా, మానవీయ కోణంలో సేవలందించేందుకు రాష్ట్ర నేర పరిశోధన(సిఐడి) విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పోలీసులే బాధితుల నివాసానికి లేదా వారు కోరిన ప్రదేశానికి వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధిచిన వివవరాలు సిఐడి డిజి చారుసిన్హా మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బాధితులకు తక్షణ ఊరట కల్పించేందుకు ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా పౌర కేంద్రిత పోలీసింగ్‌లో భాగంగా ఈ విప్లవాత్మక మార్పు తీసుకోచ్చామని పేర్కొన్నారు. కొత్త విధానం ప్రకారం నేరం జరిగినప్పుడు బాధితులు ఫోన్ లేదా నేరుగా సమాచారం అందిస్తే వెంటనే సంబంధిత అధికారి బాధితుల నివాసానికి, ఘటనా స్థలానికి,
చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తారని చెప్పారు. బాధితుల వద్దే ఫిర్యాదు స్వీకరించడం, వెంటనే స్టేషన్‌కు పంపి ఎఫ్‌ఐఆర్ నమోదు, రిజిష్టర్ అయిన తరువాత ఎఫ్‌ఐఆర్ ప్రతిని బాధితులకు ఇంటి వద్దనే అందచేస్తారని వెల్లడించారు. బిఎన్‌ఎస్ ప్రకారం అక్కడికక్కడే సాక్షాల సేకరణ, బాధితుల స్టేట్‌మెంట్ రికార్డింగ్ చేపడతామన్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించి జీరో ఎఫ్‌ఐఆర్ సహా ఏ రూపంలో అయినా కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ విధానంతో దర్యాప్తులో జాప్యం తగ్గడం, సాక్షాధారాలు తారుమారు కాకుండా రక్షించవచ్చని వివరించారు. ప్రధానంగా మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోదక చట్టం, బాల్య వివాహాల నిషేద చట్టం, ర్యాగింగ్ నిరోదక చట్టం లాంటి కేసుల్లో బాధితులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడం ఇబ్బందిగా మారుతున్న తరుణంలో ఈ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు డిజి పేర్కొన్నారు.