Reading Time: < 1 minute

 బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా హరీష్ రావును అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా అప్పటి నిఘా విభాగం అధికారులతో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో హరీష్ రావు వెంట వచ్చిన న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. విచారణ అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, చట్టాన్ని గౌరవిస్తామని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతామని స్పష్టం చేశారు. అనంతరం హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లి పోయారు.