
హైదరాబాద్: సిట్ అధికారులు తనని ప్రశ్నలు అడగటం కాదు.. తాను వాళ్లను చాలా ప్రశ్నలు అడిగానని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌తో తనకేం సంబంధమని.. తాను హోం శాఖమంత్రిగా పని చేయలేదు కాదా అని ప్రశ్నించారు. అప్పటి డిజిపి మహేందర్ రెడ్డిని, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పినట్లు పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే తనపై కక్ష్య సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు.
సిఎం రేవంత్ రెడ్డి బావమరిదే రూ.వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని హరీశ్ అన్నారు. సిఎం నిజాయతీ పరుడైతే.. బొగ్గుస్కామ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జికి అన్ని ఆధారాలు అందిస్తామని అన్నారు. మంత్రుల మధ్య వాటాల పంపకం రోడ్డు మీదకు వచ్చిందని.. మంత్రుల వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకు నాపై విచారణ చేపట్టారని పేర్కొన్నారు. ఏదో ఒక కేసులో నన్ను ఇరికించాలని సిఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చట్టాలను గౌరవిస్తా.. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతా అని స్ఫష్టం చేశారు.