
బిఆర్‌ఎస్ కారు టైటానిక్ షిప్‌లా కుటుంబ కలహాలతో మునిగిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ అంటే మీరు మాత్రమే కాదు అని అద్దంకి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడిపై ఆన వేసి మంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. కుంభకోణాల్లో ఉన్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తమను దొంగలంటూ విమర్శించడం సరైంది కాదన్నారు. దీనిని తమ పార్టీ కార్యకర్తలే కాదు తెలంగాణ సమాజం సహించదని ఆయన తెలిపారు. ఇంగ్లీషు అంటే తానే అన్నట్లు కెటిఆర్ భ్రమ పెడుతున్నారన్నారు. బిఆర్‌ఎస్ పేరును ఇంగ్లీషు రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని ఆయన సూచించారు. బిఆర్‌ఎస్ మూడు ముక్కలాట నడుస్తున్నదని అన్నారు. కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు మాట్లాడినన్ని బూతులు దేశంలో ఎవరూ మాట్లాడి ఉండరని ఆయన విమర్శించారు. కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించి జైలులో పెట్టారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావును విచారణ కోసం సిట్ పిలిస్తే గొప్ప పని చేసినట్లు సంబరపడుతున్నారని ఆయన అన్నారు.