
ప్రజల హక్కులు కాలరాసే విధంగా ఎవరు పని చేసినా ఇదే గతి పడుతుందని సంకేతం ఇచ్చేలా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు విచారణ జరగాలని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఇలాంటి పనులు చేయరాదని ఆయన మంగళవారం మీడియా ప్రతి నిధులతో మాట్లాడుతూ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేయడం పట్ల తనకు ఎటువంటి వ్యతిరేకత లేదన్నారు. కానీ కావాలని ఇబ్బంది పెట్టాలని చూడకుండా, నిజాయితీగా విచారణ జరగాలని ఆయన అన్నారు. విచారణ ద్వారా అసలైన దోషులెవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారకులెవరు? ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయి? ఎన్ని సార్లు చేశారు?, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎంత మంది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లింది? వారి హక్కులు ఎలా భగ్నమయ్యాయి? అనే వివరాలు తేలాల్సి ఉందన్నారు. అప్పుడే ప్రజలకు ఇలాంటి విచారణలపై నమ్మకం కలుగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి విచారణల వల్ల ప్రజలకు విశ్వాసం పెరగాలని ఈటల అన్నారు.