
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుని మంగళవారం సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ఓ లొట్టపీసు కేసు అని ఆయన అన్నారు. దీనిపై తాజాగా టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కెటిఆర్‌కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. టెలిగ్రాఫిక్ యాక్ట్ చదివితే ఈ కేసు తీవ్రత ఏంటో కెటిఆర్‌కు తెలుస్తుందని అన్నారు. తన ఫోన్, షబ్బీర్ అలీతో సహా చాలా మంది ఫోన్లను ట్యాపింగ్ చేసి.. ప్రైవేటు సంభాషణలు విన్నారని ఆరోపించారు. అయితే ఈ సిట్ విచారణ రాజకీయ వేధింపులు కాదని స్పష్టం చేశారు. వేధింపులకు పాల్పడాలంటే.. రెండేళ్ల వరకూ ఎందుకు వేచి చూస్తాం? అప్పుడే జైలుకు పంపేవాళ్లమని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.