
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఒక లొట్టపీసు కేసు అంటూ ఫైరయ్యారు. ఈ కేసులో ప్రస్తుతం హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈక్రమంలో కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచారణలు, కమిషన్ల పేరుతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వేధింపులలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని.. ఇది సిట్ విచారణ కాదు.. పిచ్చి విచారణ అని ఆయన ధ్వజమెత్తారు.
న్యాయం కోసం హైకోర్టు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వరకైనా వెళ్తామని కెటిఆర్ అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో రాజకీయ జోక్యం లేదని.. కాంగ్రెస్ సర్కార్ సింగరేణిని బంగారు బాతులా చూస్తుందని.. అవినీతిని బయటపెట్టిన ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఒక మీడియా సంస్థ ఏదో రాసిందని దానిపై సిట్ విచారణ వేసి.. ముగ్గురు జర్నలిస్టులను లోపల వేశారని.. మరి, ఇన్ని కుంభకోణాలు జరుగుతుంటే సిట్ వేయరా? అని కెటిఆర్ ప్రశ్నించారు.