
ఢిల్లీ: బిజెపిలో నిర్ణయాలు, ఎంపిక అన్నీ.. ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. బిజెపిలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరు అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఢిల్లీలో మోడీ ప్రసంగించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ కు అభినందనలు తెలియజేశారు. కార్యకర్త కేంద్రంగా బిజెపి సిద్ధాంతాలు ఉంటాయని, దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయని అన్నారు. గతంలో కేంద్ర హోం మంత్రి, అద్వానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేతృత్వంలో ఘన విజయాలు సాధించామని, అందరి కృషితోనే వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చేలా పార్టీ ఎదిగిందని, గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందని మోడీ కొనియాడారు. బిజెపి కార్యకర్తను అనిపించకోవడమే తనకు అసలైన గర్వకారణమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిజెపి ప్రత్యేకంగా పదవులు, బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్క కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకోవాలి.. పార్టీ కోసం కృషి చేయాలి అని సూచించారు. కొత్తగా వస్తున్న మార్పులను పార్టీ అందిపుచ్చుకోవాలి.. అనుసరించాలని, రేడియో నుంచి ఎఐ పరిజ్ఞానం వరకు అన్నింటినీ ఉపయోగించుకోవాలని మోడీ పేర్కొన్నారు.