Reading Time: < 1 minute

పాకిస్తాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరాచీలోని MA జిన్నా రోడ్డులో ఉన్న గుల్ ప్లాజా మాల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 26 మంది మరణించారని, మరో 81 మంది కనిపించకుండా పోయారని అధికారులు వెల్లడించారు. జనవరి 17న రాత్రి 10 గంటల ప్రాంతంలో మంటలు ప్రారంభమయ్యాయని, దాదాపు 34 గంటల తర్వాత అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ సైన్యం, రేంజర్స్, పౌర పరిపాలన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం రెస్క్యూ, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

కాగా, ఇప్పటివరకు 26 మృతదేహాలను సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నట్లు DIG సౌత్ తెలిపింది. ఇందులో ఆరు మృతదేహాలను గుర్తించారు. మిగిలిన మృతదేహాలను గుర్తింపు కోసం DNA పరీక్ష నిర్వహించనున్నారు. తప్పిపోయిన వ్యక్తుల కుటుంబాలు DC కార్యాలయ హెల్ప్‌లైన్‌తో సంప్రదింపులు జరపాలని అధికారులు కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు.