
హైదరాబాద్: ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని ప్రశ్నిస్తే.. తనపై కేసులు పెడుతున్నారని, సిఎం రేవంత్ రెడ్డి ముఠా అవినీతిని బయటపెడుతున్నందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. డైవర్స్ పాలిటిక్స్ తో ఎంతకాలం ప్రభుత్వాన్ని నడుపుతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయట పెడితే.. సాయంత్రానికి నోటీసులిచ్చారని, రాత్రి నోటీసులిచ్చి.. ఉదయం విచారణకు రావాలని అన్నారు. సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తాము ఏ తప్పు చేయలేదు.. తాటాకు చప్పులకు భయపడం అని తెలియజేశారు. హామీలను డైవర్ట్ చేసేందుకే నోటీసులు పంపించారని, ఎన్నికల ముందు డ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటేనని విమర్శించారు. పంచాయితీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు నోటీసులిచ్చారని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కాబట్టి తనకు నోటీసులిచ్చారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసిందని, హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా.. సిట్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేసులు న్యాయపరంగా ఎదుర్కొంటామని సవాల్ విసిరారు. మంత్రుల స్కామ్ లు, వాటాల పంచాయితీలు బయటపడుతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. బొగ్గు గనుల టెండర్లపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరుతున్నానని, రేవంత్, బిజెపి మధ్య చీకటి ఒప్పందం లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలని సూచించారు. వంద కోట్ల సింగరేణి డబ్బును ఖర్చు చేస్తున్నారని, నైనీ బ్లాక్ ఒక్కటే కాదు మిగతా టెండర్లు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయలేదని, అక్రమాలు, బొగ్గు, భూస్కాంలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నామని ఆపేది లేదని అన్నారు. జనవరి వచ్చినా.. యాసంగి రైతు భరోసా ఇవ్వలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు.