
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బొగ్గు స్కామ్, భూ స్కాంల వంటి అవినీతి, హామీలపై ప్రశ్నిస్తున్నందుకే దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నిన్న నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో హరీష్ రావు మరికొద్దిసేపట్లో విచారణకు హాజరుకానున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ భవన్ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చి, ఇవాళ ఉదయం విచారణకు రమ్మన్నారని.. తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు. డైవర్షన్ కోసమే ఇలా నోటీసులు పంపించారని వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ముందు, వీరి అవినీతి బయటపడుతుందని భయపడి తనకు నోటీసులు ఇచ్చారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. అవినీతిపై ప్రశ్నించడం మానుకునేదని.. ఉద్యమకాలం నుంచి ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని… దేనికీ భయపడేది లేదని హరీష్ రావు అన్నారు.