
అత్యంత కీలకమైన మున్నేరు పరీవాహక ప్రాంత రైతాంగ ప్రయోజనాలను ప్రక్కన బెట్టి, 5వ షెడ్యూల్ ప్రాంతాల హక్కులు, పెసా (PESA) చట్టం ఉల్లంఘిస్తూ 10 టిఎంసిల మున్నేరు జలాలను మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ ద్వారా రెండు పంటలు పుష్కలంగా పండుతూ నాగార్జునసాగర్ ఆయకట్టుగా వున్న పాలేరు చెరువుకు తరలించడం అన్యాయం, అక్రమం. మున్నేరు నీరు ఆ ప్రాంత ప్రజల జీవనాధారం. చట్టబద్ధమైన హక్కులను కాలరాస్తూ ప్రాజెక్టులు చేపడితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం నుండి ప్రవహిస్తూన్న మున్నేరుపై దుబ్బగూడెంమద్దివంచ గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యామ్‌నుండి మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ (గ్రావిటీ కాలువ) ప్రారంభించబడి గార్ల మండలంలోని బుద్ధారం సమీపంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాల్వకు అనుసంధానం చేయడం ద్వారా పాలేరు చెరువుకు 10 టిఎంసిల నీటిని తరలించనున్నారు.
మే 17, 2025న మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణానికి 162.54 కోట్ల రూపాయల నిధులు మంజూరి చేస్తూ జీవో నెంబర్ 98ని ఖమ్మం జిల్లా మంత్రుల ప్రమేయంతో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. మున్నేరు-పాలేరు లింకు కెనాల్ నిర్మాణం కోసం గార్ల మండలంలో 9.5 కిలోమీటర్ల పొడవున భారీ కాలువ తవ్వనున్నారు. ఈ కాలువ క్రింద చిన్న సన్నకారు పేద గిరిజన రైతులు 350 ఎకరాల వ్యవసాయ సాగు భూములను కోల్పోనున్నారు. ఒక చుక్క నీరు కూడా మున్నేరు పరీవాహక ప్రాంత రైతాంగానికి ఇవ్వడం లేదు. ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం నియోజిక వర్గాలలో 60 వేల ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు త్రాగునీరు అందించాల్సిన మున్నేరు పప్రాజెక్ట్‌ను 60 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చారిత్రక నిర్లక్ష్యం చేస్తూన్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మున్నేరు ప్రాజెక్టు నిర్మాణానికి 131.67 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ తేది 24 జూన్ 2009న జీవో నెంబర్ 1076ను విడుదల చేసింది, కానీ మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మున్నేరు ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాన్ని సీతారామ ప్రాజెక్ట్ ఆయకట్టులో కలుపుతూ కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వార్థ పూరిత రాజకీయ ప్రయోజనాలకు సీత రామ ప్రాజెక్ట్ బలిపశువుగా మారి మున్నేరు ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతానికి సీతారామ జలాలు రాకుండా పోయాయి.
సీత రామ ప్రాజెక్ట్ విషయంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో చేసిన తప్పిదాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాల్సి వుండగా, అదే తప్పిదాన్ని యథాతథంగా కొనసాగించడం ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యానికి, తెలితక్కువ తనాన్ని తేటతెల్లం చేస్తుంది. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలంలో నిర్మించనున్నమున్నేరు పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా పాలేరులో వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మున్నేరు ప్రాజెక్టు, మున్నేరుపాలేరు లింక్ కెనాల్, తదితర నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో ఆయా ప్రాంతాల నీటి అవసరాలను, చారిత్రక , భౌతిక, వాస్తవిక అంశాలను వెల్లడించకుండా ఖమ్మం జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఈ ప్రాజెక్ట్‌ల పట్ల ఖమ్మం జిల్లా మంత్రుల వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వ్యతిరేకతలు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ మున్నేరుపాలేరు లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టడం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. మున్నేరు నదిపై మున్నేరు ప్రాజెక్ట్ (మున్నేరు రిజర్వాయర్) కడితే గార్ల, బయ్యారం మండలాల్లోని వేల ఎకరాలకు నీరు అందుతుంది.
కానీ ఆ పనులు పక్కన పెట్టి కేవలం తరలింపు కెనాల్‌పై దృష్టి పెట్టడం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను ఎండగాడుతూ స్థానిక ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజాభీష్టం మేరకు మున్నేరు – పాలేరు లింక్ కెనాల్‌ను విరమించుకుంటూ మున్నేరు – పాలేరు లింక్ కెనాల్, నిర్మాణం కోసం ఇచ్చిన జిఒను రద్దు చేసి ప్రభుత్వం తన విజ్ఞతను చాటాలి. మున్నేరు నీటిపై ఆ ప్రాంత ప్రజలకు ఉన్న సహజ సిద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి న్యాయ పోరాటంతోపాటు ప్రజాపోరాటం చాలా అవసరం. మున్నేరు- పాలేరు లింక్ కెనాల్ కంటే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణమే ఆ ప్రాంత సుస్థిర అభివృద్ధికి ఏకైక మార్గం.
విశ్వ జంపాల
77939 68907