
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరీశ్‌రావు జోస్యం నిజమయింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (ప్రత్యేక దర్యా ప్తు బృందం) అధికారులు తనకు నోటీసులు ఇస్తారన్న మాజీ మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు అనుగుణంగా విచారణ రావాలని కోరుతూ సిట్ అధికారులు హరీశ్‌రావుకు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన సి ట్ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ను ఇటీవల కస్టడీలోకీ తీసుకుని విచారించిన సిట్ అధికారులు కేసును త్వరగా తేల్చాలని దర్యాప్తు ముమ్మ రం చేస్తున్నారు. ప్రభాకర్ రావు గత విచారణ సందర్భంగా హరీశ్‌రావు పేరు సిట్ అధికారులకు చెప్పినట్లు ప్రచారం జరిగింది.
దీంతో హరీశ్‌రావు పాత్రపైన సిట్ అధికారులు దృష్టి సారించారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ మాజీ మంత్రి హరీశ్‌రావు తన ఫోన్‌ను ట్యాప్ చేయించడాన్ని అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చక్రధర్ గౌడ్‌ను ఇటీవల సిట్ అధికారుల మరోసారి విచారించారు. వరుస విచారణలు జరుగుతన్న క్రమంలో కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేస్తారని ప్రచారం జరిగినా, అధికారుల మాత్రం దృవీకరించలేదు. అయితే పలు మార్లు మీడియా చిట్ చాట్‌లో హరీశ్‌రావు మాత్రం అసెంబ్లీ సమావేశాల అనంతరం తనకు నోటీసులు ఇస్తారని బహిరంగంగానే చెప్పుకోచ్చారు. అయితే ఓ చానెల్ ఎండి స్టేట్‌మెంట్ మేరకు సిట్ అధికారులు హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అరెస్ట్ నుంచి తప్పించుకున్నా అధికారులు చివరకు కస్టోడియల్ ఎంక్వైరీ చేశారు.
దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ ద్వారా నష్టపోయిన బాధితులు, అధికారుల కాల్ డేటా సహా వాట్సాప్, సోషల్ మీడియా డేటాను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వీటి ఆధారంగా సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల సిట్ పలువురికి నోటీసులు ఇచ్చి విచారించింది. బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, అతడి తండ్రిని సిట్ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు విచారణపై దర్యాప్తు సంస్థను ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేస్తూ ఇంకెంత కాలం విచారణను కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలుంది? అంటూ స్పష్టమైన ప్రశ్నలు సంధించింది. ప్రభాకర్‌రావు విచారణను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించిన అత్యున్నత ధర్మాసనం ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరిస్తారని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ పరిణామాల క్రమంలో తాజాగా బిఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.